నారా లోకేశ్ ‘యువగళం’ ఆరో రోజు పాదయాత్ర.. Nara Lokesh Yuvagalam today updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో 2023 జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి ఈరోజు వరకూ ప్రజలు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేస్తున్నారు. ఈ పాదయాత్ర దాదాపు 400 రోజులు పాటు 4వేల కిలోమీటర్ల మేర శని, ఆదివారాలు విరామాలు లేకుండా కొనసాగనుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్ర.. ప్రతి నియోజకవర్గంలో మూడు రోజులు ఉండేలా కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు నుంచి నేటివరకూ ప్రజలు, టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున లోకేశ్‌కు స్వాగతం పలుకుతూ.. తమ మద్దతు తెలుపుతున్నారు.
ఆరో రోజుకు చేరిన 'యువగళం': టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర నేటితో ఆరో రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని కమ్మనపల్లె విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో కొలమాసనపల్లిలో చెరకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందడం లేదని.. ఎరువుల కొరతతో కర్ణాటక నుంచి ఎరువులు తెచ్చుకుంటున్నట్లు లోకేశ్ ఎదుట రైతులు వాపోయారు.
టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసంపై లోకేశ్ ఆగ్రహం:కోలమాసనపల్లిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తూ.. యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ ప్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారన్నారు. అలా చేయడం చాలా దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు టీడీపీ ఫ్లెక్సీలు చూస్తే ఎందుకంత భయమని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి పసుపు రంగు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా భయం పట్టుకుందని లోకేశ్ ఎద్దేవా చేశారు. మా సహనాన్ని పరీక్షించొద్దని మరోసారి గట్టిగా హెచ్చరించారు.
వారాహి-యువగళం పాదయాత్ర ఆగదు: 'ఏ1 తెచ్చినా.. జీవో1తో వచ్చినా? పవన్ కళ్యాణ్ వారాహి ఆగదు-యువగళం పాదయాత్ర ఆగదు' అంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తనకంటే ఉత్సాహంగా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని అభినందించారు. అనంతరం నారా లోకేశ్ గొల్లపల్లికు చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గడిచిన స్థానిక ఎన్నికల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న స్థానిక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
పలమనేరు టీడీపీ కంచుకోట:రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీకి పలమనేరు నియోజకవర్గం కంచుకోటలాంటిదని నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లే ఇప్పటికి ప్రతి గ్రామంలో ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగిన పాపాన పోలేదని విమర్శించారు. సీబీ, సీఐడీ వారు కల్తీ మద్యం అమ్మేవారిని, బాబాయ్‌ని హత్య చేసిన వారిని, అత్యాచారాలు చేసేవారిని వదిలేసి.. కడుపుమండి ప్రభుత్వానికి విరుద్ధంగా ఎవరైనా ట్వీట్ చేసినా, సామాజిక మాధ్యమల్లో పోస్టులు పెట్టినా.. అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. దీన్నిబట్టి వారి భవిష్యత్ కార్యచరణ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా పవన్ కల్యాణ్ వారాహి ఆగదు, నా పాదయాత్ర ఆగదని మరోసారి స్పష్టం చేశారు. రాబోవు 2024 ఎన్నికల్లో ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.
ఆరో రోజు కమ్మనపల్లె నుంచి రామాపురంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం వరకు 13.8 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది. రామాపురం క్యాంప్ సైట్‌కు చేరుకున్న లోకేశ్‌ను ప్రభుత్వ ఉపాధ్యాయలు కలిశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. వారి సమస్యలను విన్న లోకేశ్ భావిభారత పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షగట్టిందని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం చేసే న్యాయమైన పోరాటానికి తెదేపా అండగా నిలుస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి