Nara Lokesh 'Yuvagalam' Padayatra updates: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 12 రోజులు పూర్తి చేసుకుంది. 12వ రోజున కొంగారెడ్డిపల్లి బస ప్రాంతం నుంచి చిత్తూరు గ్రామీణ దిగువమాసపల్లి వరకు 6.1 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రలో భాగంగా సీఎం జగన్‌పై నారా లోకేశ్ తీవ్రంగా ఆగ్రహించారు. రోడ్డుపై రావడానికి భయపడి తాడేపల్లి ప్యాలెస్‍లో దాక్కుంటున్న జగన్.. ప్రజల్లోకి రావాల్సి వచ్చినా పరదాలు కట్టుకుని జనాలకు దూరంగా తిరుగుతున్నారని ధ్యజమెత్తారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 12వ రోజు 6.1 కిలోమీటర్లు సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు వరకు విరామం తీసుకున్న లోకేశ్.. కొంగారెడ్డిపల్లి టీడీపీ జిల్లా కార్యాలయం సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం కొంగారెడ్డిపల్లి జంక్షన్, సంజయ్ గాంధీనగర్ మీదుగా దిగువమాసపల్లి విడిది కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చిత్తూరు నగరంలోని సంజయ్ గాంధీనగర్‌లోని మూసేసిన అన్నా క్యాంటీన్‌ను లోకేశ్ పరిశీలించారు. అన్నా క్యాంటీన్ మూసివేసి.. సచివాలయం ఏర్పాటు చేసిన తీరును స్ధానిక నేతలు లోకేశ్‍కు వివరించారు. సిబ్బంది అనుమతితో సచివాలయం లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన సిబ్బందితో మాట్లాడారు.
పాదయాత్రలో భాగంగా కొంగారెడ్డిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ పాలనను దుయ్యబట్టారు. '2024 తర్వాత జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు ఎలా వస్తావో చూస్తా.. జగన్‍కు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా' అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పని అయిపోయిందని.. తెలుగుదేశం పార్టీ సమయం ఆసన్నమైందన్నారు. జనం మధ్య తిరగలేని జగన్.. పరదాల చాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జనం ఆశీస్సులతో 'యువగళం' పాదయాత్ర చేయగలుగుతున్నామని.. తన ప్రచార రథం, మైక్ సీజు చేయడం చూస్తే తెలుగుదేశం అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుందన్నారు. తప్పడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు.