తెలుగుదేశం నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. పార్టీ యువ నాయకుడు... జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. అక్టోబరు నుంచే యాత్ర చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. వివిధ కారణాలు, క్షేత్రస్థాయి సన్నద్ధత దృష్ట్యా యాత్రకు అడుగులు పడలేదు. 2023 జనవరి 27నుంచి పాదయాత్ర చేపడతానని స్వయంగా లోకేశ్ చెప్పడంతో నేతల ఆనందానికి అవధుల్లేవు. దాదాపు 400రోజులు...4వేల కిలోమీటర్ల మేర శని, ఆదివారాలు విరామాలు లేకుండా యాత్ర సాగనుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో 3రోజులు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ బహిరంగ సభలకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగమే ప్రధాన అజెండాగా యాత్ర సాగనుంది. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసి... రైతులు, మహిళలు, వివిధ వర్గాల సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా...., దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే స్థాయిలో పార్టీ కార్యకలాపాలు లేవనేది తెదేపా శ్రేణుల అంతర్మథనం. లోకేశ్ పాదయాత్ర ఈ లోటును భర్తీ చేస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లి... అధికార పార్టీని గద్దె దించేందుకు.. లోకేశ్ యాత్ర సరైన సాధనమని అంటున్నారు.