చిత్తూరు జిల్లాలో బుధవారం తెదేపా నాయకులు, పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం తోపులాటకు దారితీసి చివరకు గృహనిర్బంధం వరకు వెళ్లింది. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు కుప్పం నుంచి చిత్తూరులోని అతని ఇంటికి తీసుకొచ్చారు. బయటకు రాకుండా ఉదయాన్నే పోలీసులు భారీగా మోహరించారు. నాని నివాసంలో అప్పటికే విలేకరుల సమావేశం పూర్తిచేసుకొని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నాని, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు ‘ప్రజాపరిరక్షణ యాత్ర’ పేరిట కుప్పం వెళ్లేందుకు బయల్దేరారు. వారు ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. మహిళా కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో నాయకులు నాని నివాసంలోకి వెళ్లిపోయారు. వివాదం పెద్దదవుతుండటంతో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి వారితో చర్చించారు.
నిర్బంధాన్ని ఛేదించుకుని ప్రచారం..
మాజీ మంత్రి అమరనాథరెడ్డి, దొరబాబు, పులివర్తి నానిని మంగళవారం రాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు తెల్లవారుజామున వారి స్వస్థలాలకు చేర్చారు. పలమనేరులో స్వగృహానికి చేరిన అమరనాథరెడ్డి వేకువజామునే స్వెట్టర్, తలపాగా చుట్టుకొని బయటకు వచ్చారు. ఇంటి వెనుక గోడ దూకగా చేతికి గాయమైంది. అక్కడే పాఠశాలలోకి వెళ్లి కారు తెప్పించుకున్నారు. రహస్యంగా బయల్దేరి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా కుప్పంలోని తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి 16వ వార్డులో ప్రచారం చేశారు.
అర్ధరాత్రి తరలింపు..
మంగళవారం అర్ధరాత్రి దాటాక కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం ఇంట్లో ఉన్న రామానాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే తాను స్టేషన్‌కు వస్తానని, అప్పటికీ రాకుంటే అరెస్టు చేయాలని ఆయన కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో అర్ధరాత్రి 1.40 గంటలకు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసుల కారు ఎక్కారు. కుప్పం అర్బన్ స్టేషన్‌లో కొంతసేపు ఉంచిన తర్వాత చిత్తూరులోని నాని ఇంటికి తరలించారు.