నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తమపార్టీ మద్దతుదారుల నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారంటూ... ఎస్ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బెదిరింపులతో.. 33 పంచాయతీల్లో ఉద్దేశపూర్వకంగా తాము బలపరచిన అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరించారన్నారు. అందుకు కారణాన్ని రిటర్నింగ్ అధికారులు రాతపూర్వకంగా కానీ, మౌఖికంగానూ ఇప్పటి వరకు తెలియజేయలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడంతో.. అప్పీలు చేసుకునే చట్టబద్దమైన హక్కును అభ్యర్థులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లోని పలువురి నామినేషన్లు సక్రమంగా ఉన్నా తిరస్కరించారంటూ పంచాయతీలతో సహా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఏకపక్షంగా నామపత్రాలను తిరస్కరించి, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా మద్దతుదారులు వేసిన 33 నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని.. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.