ఇటీవల తంబళ్లపల్లెలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు తెలుగుదేశం నేతలు వెళ్తుండగా మార్గమధ్యంలో వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తెలుగుదేశం నేతల వాహనాలను అడ్డుకున్న వైకాపా శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో తెదేపా నేతల వాహనాలు ధ్వంసమవగా పలువురు తెదేపా నేతలకు గాయాలయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
తెదేపా నేతలు తలపెట్టిన చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని తంబళ్లపల్లె పరిధిలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని తెలిపారు. జిల్లాలో పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు.
తిరుపతిలో నరసింహయాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మదనపల్లెలో శంకర్‌యాదవ్, చిత్తూరులో దొరబాబు, నానిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లెకు వెళ్తున్న శ్రీకాళహస్తి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కడపలో గోవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లె వెళ్తున్న తెదేపా నేత శ్రీనివాసరెడ్డిని కడప జిల్లా రామాపురం వద్ద పోలీసులు అరెస్టు చేసి..ఆయన స్వగ్రామం లక్కిరెడ్డిపల్లెకు తరలించారు. కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.....కార్యకర్తలు నిరసనకు దిగారు.