నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వైకాపాకు తిరుపతి ఉపఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో పనబాక లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పక్కనబెట్టి నవరత్నాలు పేరుతో అధికార పార్టీ ప్రజలు మోసం చేస్తోందని విమర్శించారు. వైకాపా కార్యకర్తలు, వాలంటీర్ల బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. భాజపా, అధికార వైకాపాపై విమర్శలు గుప్పించారు. వైకాపా తరఫున 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటివరకు పార్లమెంటులో గళం విప్పిన దాఖలాలు లేవన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన భాజపా.. మరలా ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తుందని విమర్శించారు.