చిత్తూరు జిల్లాలో 2,774 హెక్టార్లలోని చింతచెట్ల ద్వారా ఏటా 16,500 టన్నుల చింత పండు దిగుబడి అవుతోంది. శీతల గోదాములు అధికంగా ఉన్న పుంగనూరులో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న తరవాత ఒబ్బిడి చేసి ఏడాది పొడవునా మార్కెట్‌లకు తరలించేవారు. ఏడాది పొడవునా పుంగనూరు, కురబలకోట, పలమనేరు, చౌడేపల్లె తదితర ప్రాంతాల్లో సుమారు 20 వేల మంది కూలీలకు ఉపాధి ఉంటోంది. కరోనా ప్రభావంతో చింత ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏ స్థాయిలో ధరలు ఉన్నాయో ప్రస్తుతం అలాగే ఉండడంతో చింత పండు ఎగుమతులు స్తంభించి పోయాయి. గోదాముల్లోని చింతపండును ఒబ్బిడిచేసి ఎగుమతి చేయకపోవడంతో ఇటు కూలీలకు ఉపాధి కరవైంది. వినియోగదారులకు ధరల భారం పడుతోంది. ప్రతి సీజన్‌లో స్థానికంగా లభ్యమయ్యే చింత పండుతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ శీతల గోదాముల్లో నిల్వ చేయడం ఆనవాయితీ. మూడు నెలలుగా చింత పండు ఎగుమతులు ఆగిపోవడంతో కార్మికులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా ప్రభావంతో చింత...ఉపాధి కోల్పోయిన కూలీలు
కరోనా మహమ్మారితో ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఈ ఏడాది చింత మార్కెట్ ఒడుదొడులను ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లాలో కూలీలు, డ్రైవర్లు, క్లీనర్లు ఉపాధిలేక అలమటిస్తున్నారు.
దిగుమతులు అంతంతమాత్రమే..
మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి స్థానిక వ్యాపారులు చింతపండును దిగుమతి చేసుకోవడం పరిపాటి. ఇక్కడ నిల్వచేసుకుని తిరిగి అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చపాతీ, పూపండు, కరిపులి రకాలుగా విభజించి ఎగుమతి చేస్తారు. కట్టెకాయ నుంచి వివిధ రకాల పండుగా విభజించే వరకూ కూలీలకు ఏడాది పొడవునా పనిఉంటుంది. పుంగనూరు ప్రాంతంలో 12 వేల కుటుంబాలకు చింతపండు పరిశ్రమ ఉపాధి మార్గం చూపుతోంది. గతంలో పుంగనూరు ప్రాంతంలోనే 35 వేలు నుంచి 40వేల టన్నుల చింతపండు నిల్వచేసేవారు. ప్రస్తుతం 20 వేల టన్నుల లోపే పండు నిల్వ ఉంది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి.