దేశం కోసం అహర్నిశలూ పోరాడుతున్న సైనికుల గౌరవార్థం.. కేంద్రం ఇచ్చే సాహస పతకాలకు తోడుగా రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహకాలను పది రెట్లు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. సైనికుల త్యాగాలను కీర్తించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విశేష సేవలందించిన వీరులు, వారి కుటుంబాలను సత్కరించారు.
అది భారత్ సహకరించిన అద్భుత ఘట్టం..
నియంతృత్వం దిశగా సాగిన పాక్ ఆటలు కట్టించి.. బంగ్లాదేశ్‌ను సరికొత్త దేశంగా ఆవిష్కృతమయ్యేందుకు భారత్ సహకరించిన అద్భుత ఘట్టం 1971లో జరిగింది. ఆ ఏడాది పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ చారిత్రక విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ పోరులో సేవలందించిన రాష్ట్రానికి చెందిన సైనికులను గౌరవించుకునేలా.. భారత సైన్యం " స్వర్ణిమ విజయ్ వర్ష్ " పేరుతో తిరుపతి పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించింది.
విక్టరీ ఫ్లేమ్‌ను అందించి..
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి ఘనస్వాగతం పలికారు. అనంతరం తిరుపతిలోని విశ్రాంత మేజర్ జనరల్ సీవీ వేణుగోపాల్ నివాసం వైట్ హౌస్‌కి చేరుకున్నారు. అనంతరం ఆయనకు విక్టరీ ఫ్లేమ్‌ను సీఎం అందించి గౌరవించారు. యుద్ధం నాటి పరిస్థితులను వేణుగోపాల్‌ను అడిగి జగన్ తెలుసుకున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్ ఇంటి వద్ద మొక్క నాటారు.
వారి కుటుంబీకులకు ఘన సన్మానం..
వేదిక పక్కనే ఉన్న పీఠంపై విజయజ్వాలను ఉంచిన సీఎం.. నాటి యుద్ధానికి సంబంధించిన వీడియోలను సైనికాధికారులతో కలసి వీక్షించారు. ఆ సమయంలో సింఫనీ బ్యాండ్ ఆలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. 1971 నాటి యుద్ధంలో సేవలందించిన విశాఖకు చెందిన నాటి పీఠంపైకి తీసుకువచ్చిన సీఎం.. విజయజ్వాలను అక్కడ ఉంచి గౌరవించారు. నాటి యుద్ధానికి సంబంధించిన వీడియోలను సైన్యాధికారులతో కలిసి సీఎం తిలకించారు. అనంతరం నాటి యుద్ధంలో పాల్గొని సేవలందించిన కీర్తిశేషులు విశాఖకు చెందిన సన్యాసి నాయుడు, కాకినాడకు చెందిన క్రిస్టఫర్ తరపున సీఎం వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.
ఎండను, మంచును లెక్క చేయకుండా..
అనంతరం స్వర్ణోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్.. నాటి పాక్ నియంతృత్వ పోకడలను నిలువరించేలా భారత సైనికులు ప్రదర్శించిన అసమాన సాహసాలను కొనియాడారు. ఎండ, మంచులను లెక్క చేయకుండా పోరాడిన భారత సైన్యం..కేవలం 13 రోజుల్లోనే పాకిస్థాన్ ఆటకట్టించి.. బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పాటు అయ్యిందేకు ప్రధాన భూమిక పోషించిందన్నారు.