ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FARMERS PROTEST: చెరకు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరసన - రైతుల నిరసనలు

రెండు సంవత్సరాలుగా చెరకు బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు చిత్తూరు జిల్లాలో నిరసనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదంటూ వర్షాన్ని సైతం లెక్కచేయక రోడ్డుపై బైఠాయించారు. చివరికి పోలీసుల హామీతో నిరసన విరమించారు.

FARMERS PROTEST
FARMERS PROTEST

By

Published : Oct 5, 2021, 9:19 PM IST

చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండల పరిధిలో ఉన్న నేతం షుగర్స్ వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గడచిన రెండు సంవత్సరాలుగా రూ. 36 కోట్ల బకాయిల చెల్లింపులు పేరుకుపోయినా పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నా.. పరిశ్రమ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక రైతులు రోడ్డుపైనే బైఠాయించారు.

చెన్నై-కడప జాతీయ రహదారిపై అన్నదాతలు ఆందోళనకు దిగడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా కలెక్టర్ వచ్చి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో పుత్తూరు డీఎస్పీ, నిండ్ర పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నేతం షుగర్స్ పరిశ్రమపై హై కోర్టులో ఉన్న స్టే ని తొలగించి పరిశ్రమ ఆస్తులు, యంత్రాలను వేలం వేసి తమ బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని పోలీసులు హమీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు.

ABOUT THE AUTHOR

...view details