విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం సహా సంస్కారం, సంఘసేవ, పక్షుల పోషణ, అహింసా మార్గాన్ని నేర్పించి చిరస్మరణీయుడైన ఉపాధ్యాయుని అడుగుజాడల్లోనే నడుస్తూ అతని ఆశయాల సాధన కోసం ఆచరిస్తూనే ఉన్నారు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. కరవు పీడిత ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గంలో తరచూ నీటి ఎద్దడి తీవ్రమై మనుషులే కాదు, పక్షులు కూడా అల్లాడుతాయి. వాటి కోసం తన పరిధిలో ఏదైనా సహకారం చేయాలని ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు మల్లికార్జున సంకల్పించారు. పాఠశాలలో ఏపుగా పెరిగిన చెట్లపై తట్టలను ఏర్పాటు చేసి... వాటిలో రకరకాల ధాన్యం వేసి పక్షుల ఆకలి తీరుస్తూ, ఆవరణలో చిన్న చిన్న నీటి గుంతలు ఏర్పాటు చేసి వాటిల్లో నీటిని నింపి దాహం తీర్చేవారు. సెలవు రోజుల్లో సైతం పాఠశాల చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు వచ్చి పక్షులకు ఆహారం నీటిని అందించే విధంగా ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు మల్లికార్జున గత సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణానికి గురయ్యారు.
మల్లికార్జున చిత్రపటాన్ని పూజిస్తున్న విద్యార్థులు...