చిత్తూరు జిల్లాలో ఇసుక రేవులు, విక్రయ వ్యవహారాలన్నీ ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు మార్పు జరిగింది. జిల్లా వ్యాప్తంగా జై ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాధ్యతలను అప్పగించింది. ఇకపై ఈ సంస్థ నుంచే ఇసుక కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 13 రాత్రి నుంచి ప్రభుత్వ పరంగా విక్రయాలు ఆపివేసి 14 నుంచి ప్రైవేటు సంస్థ ఇసుక రేవులను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో 14 ఇసుక రీచ్‌లు, 86 గ్రామ పంచాయతీ కార్యదర్శి పరిధిలో రేవులు ఉన్నాయి. ఇవన్నీ కొత్త సంస్థ చేతికి వెళ్లాయి. జిల్లాలో రేణిగుంట, అవిలాల వద్ద రెండు ఇసుక డిపోలున్నాయి. గతంలో ఇక్కడి నుంచి విక్రయాలు ఇది వరకు జరిగాయి. ఇవి కొనసాగుతాయా లేదా అనే విషయమై స్పష్టత లేదు.
- టన్ను ధర రూ.475
రేవుల వద్ద ఇసుక టన్ను ధర రూ.475గా నిర్ణయించారు. ఒక వేళ డిపోల వద్ద కొనుగోలు చేసుకునే పక్షంలో సంస్థ రేవు నుంచి తీసుకురావడానికి అయిన రవాణా ఖర్చు, టోల్ ఛార్జీలు కలిపి విక్రయిస్తారు. ఈ ధర స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. డిపోలు ఏర్పాటు చేయడం... చేయకపోవడం సంస్థ ఇష్టాన్ని బట్టి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విక్రయించిన ఇసుకకు బిల్లు ఇవ్వాలనే నిబంధన ఉంది.
- జోన్-3 కిందకు 5 జిల్లాలు
ఇసుకను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. జోన్-3 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. జిల్లాలోని డిపోలు, రీచ్‌ల్లోని సీసీ కెమెరాలు, ఇతరత్రా పరికరాలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నారు.
- కొన్ని పరిమితులున్నాయి
స్థానికంగా పేదల గృహ నిర్మాణానికి ఉచితంగా ఇసుక తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. రీచ్‌కు సమీపంలోని గ్రామాల ప్రజలకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. సొంత గృహ నిర్మాణానికి మినహాయింపు ఉందన్నట్లు అధికారులు చెబుతున్నారు.