ISRO NEW LAUNCH ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి, మొట్టమొదటిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తక్కువ వేగం కారణంగానే నిర్దేశించిన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేక పోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. రాకెట్‌లోని మూడో దశ ఫైరింగ్ మొదలవడం, అది పూర్తయిన వెంటనే ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకు నిర్దేశిత వేగంతో ఉపగ్రహాలను కక్ష్యలోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వాహక నౌక వేగం సెకనుకు 7.3 కి.మీ అయితే అది సెకనుకు 7.2 కి.మీలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి 356 కి.మీ. ఎత్తుకు వాహక నౌక చేరగా ఇది నిర్దేశిత పెరిజీ (భూమికి దగ్గర కక్ష్య) ఎత్తు కంటే తక్కువ. ఇక్కడ ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో కదులుతున్నప్పుడు వాతావరణం కీలకంగా మారుతుంది. ఉపగ్రహం చాలా వేగంగా కిందికి వచ్చేలా పనిచేస్తుంది. దీంతో ఉపగ్రహం తన కక్ష్యను కోల్పోతుంది. ఈ లోపమే ఎస్‌ఎస్‌ఎల్‌వీలో జరిగినట్లు స్పష్టమవుతోంది. రాకెట్‌లో అన్ని దశలు, ప్రొపల్షన్, సీక్వెన్స్ వ్యవస్థలు పనిచేసినట్లు భావిస్తున్నారు. యాక్సిలరో మీటర్‌లో అసాధారణత కారణంగా లోపల ఉన్న కంప్యూటర్.. యాక్సిలరో మీటర్ విఫలమైనట్లు చూపింది. ఆ కారణంగానే ఉపగ్రహాలను తప్పు కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా ప్రేరేపించింది. అయితే యాక్సిలరో మీటర్లతో సమస్య లేకపోయినా చిన్న సమస్య ఉన్నట్లు కంప్యూటర్ సూచించిందని, ఎందుకు అలా జరిగిందన్నది అర్థంకావడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సెన్సర్‌లో అసలు సమస్య ఉండొచ్చని ఓ అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద రెండు సెకన్లపాటు వాహన నౌకలో క్రమరాహిత్యం నెలకొని ఉపగ్రహాలు చేజారినట్లు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే.. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ చేపట్టిన.. దేశ తొట్ట తొలి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV-D1 ప్రయోగం విఫలమైంది. ప్రాథమిక దశలను విజయవంతంగా దాటుకుని నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్.. ఉపగ్రహాలను తప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహకనౌక EOS-02, అజాదీశాట్ ఉపగ్రహాలను వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ.. సాంకేతిక సమస్య కారణంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఫలితంగా రెండు ఉపగ్రహాలూ పనికిరావని ఇస్రో వెల్లడించింది.సెన్సార్ వైఫల్యమే ఇందుకు కారణమని తేల్చింది. త్వరలో SSLV-D2 చిన్న ఉపగ్రహ వాహకనౌకను ప్రవేశపెడతామని ఇస్రో ప్రకటించింది.