తిరుమల శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టికెట్లను పెంచే యోచన లేదని.. కరోనా తీవ్రత తగ్గాకే సర్వదర్శనం ప్రారంభంపై ఆలోచిస్తామని తితిదే స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం ఆయన సీఈ నాగేశ్వరరావు, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టితో కలిసి పరిశీలించారు. గతంలో సర్వదర్శనం టికెట్లను జారీచేయగా భక్తులు పెద్దఎత్తున గుంపులుగా చేరారని ఈవో గుర్తుచేశారు. కరోనా పాజిటివిటీ రేటు ఒకశాతం లోపునకు వస్తే శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై ఆలోచిస్తామని స్పష్టంచేశారు. తిరుమలలో కాటేజీల ఆధునికీకరణను వేగవంతంచేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
శ్రీవారి ప్రసాదం జిలేబీ, మురుకుల ధర పెంపు
శ్రీవారి ప్రసాదమైన జిలేబీ, మురుకుల ధరను తితిదే పెంచింది. ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. మిగిలిన ప్రసాదాలను వివిధ విభాగాల్లోని వారికి విచక్షణ కోటా కింద రూ.100కి ఇస్తున్నారు. వీటి ధరను రూ.100 నుంచి రూ.500కు ధర పెంచుతూ తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు.