8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం...
ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కూడా అలిపిరిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 65 ఏళ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఉదయం 6.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయని అన్నారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్లపాటు అనుమతి ఉండదని..ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా 3 వేల దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతామని...నేరుగా వచ్చి 3 వేలమంది శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు తప్పనిసరి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.