శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 నవంబర్ నెలకు సంబంధించి 69,254 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లు విడుదల చేశారు. సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120 టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లు కేటాయించారు. కరెంటు బుకింగ్ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. విశేషపూజ 1,500.. కల్యాణోత్సవం 13,300 సేవా టికెట్లు ఊంజల్‌సేవ 4,200.. ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700 టికెట్లు, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ 16,800 టికెట్లు విడుదలయ్యాయి.
ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 9న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం జరగనుందని తెలిపారు. జులై నెలలో 23.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించినట్లు ఈవో తెలిపారు. జులై నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. జులై నెలలో హుండీ ద్వారా రూ.100.60 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు.