Tehsildar caught red handed by ACB: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని ఓ గ్రామంలో చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిని తమకు బదలాయించాలని కోరుతూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అయితే అక్కడ లంచం బాధ భరించలేక అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ ఆధికారులు పన్నిన వలలో తహసీల్దార్, వీఆర్ఓ ఇద్దరూ చిక్కి అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
చిన్న శెట్టివాత్తం గ్రామానికి చెందిన లక్ష్మణ్ రెడ్డి తల్లిదండ్రులు మరణించారు. దీంతో తమ తల్లిదండ్రుల పేరుపై ఉన్న ఆస్తిని తన అన్న వెంకట్‌రెడ్డి పేరుపై బదలాయించాలని కోరుతూ తమ పంచాయతీ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. సుమారు నెలరోజుల పాటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం దక్కకపోవడంతో పక్క పంచాయతీ వీఆర్ఓ గోవిందరెడ్డి సాయంతో తహసీల్దార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
శ్రీరంగ రాజపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ గోవిందరెడ్డి సాయంతో రైతు లక్ష్మణ్ రెడ్డి తహసీల్దారును సంప్రదించాడు. అయితే రికార్డులను బదలాయించేందుకు అతడిని రూ.25 వేలు ఇవ్వమని తహసీల్దార్ డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అయితే తహసీల్దార్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేక అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ విభాగం ఏఎస్పీ దేవప్రసాద్ నేతృతంలో అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు జరిపి లంచం తీసుకుంటున్న తహసీల్దారును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.