తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏడు టన్నుల పుష్పాలతో పుష్పార్చన చేయనున్నారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు... కర్ణాటక, తమిళనాడు నుంచి ఏడు టన్నుల పూలను సేకరించారు. భక్తులు విరాళంగా పంపిన పూలకు పూజలు నిర్వహించారు. తితిదే ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు.
"స్వామి వారి పుష్పయాగం కోసం సుమారు 7 టన్నుల సాంప్రదాయ పూలు, పత్రాలు సేకరించాం. నాలుగు టన్నులు తమిళనాడు , రెండు కర్ణాటక, ఒక టన్ను ఆంధ్రా- తెలంగాణ నుంచి వచ్చాయి. 14 రకాల కుసుమాలు, 6 రకాల పత్రాలను పుష్పయాగంలో వినియోగిస్తున్నాం. చామంతి, రుక్షి, గన్నేరు, రోజాలు, సంపంగి, మల్లెలు, మొల్లలు, కనకాంబరం, తామరలు, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి, సెంటు జాజులు, పగడపూలు.. పత్రాలకు సంబంధించి తులసి, మరువం, ధవనం, బిల్వము, కదిరిపచ్చ, పన్నీరాకు దాతల సాయంతో ఏర్పాటు చేస్తున్నాం" అని ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.