Sreeja milk dairy: పాల ఉత్పత్తి అధికంగా ఉన్నా.. వ్యాపార ధోరణికి అలవాటుపడిన దళారులు ఏకమై.. పాడి రైతుల కష్టాన్ని కాసులుగా దోచుకొంటున్న పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు మహిళలు ధైర్యంగా తీసుకున్న ఓ నిర్ణయం.. పాడిపై ఆధారపడే వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తాము ఉత్పత్తి చేసే పాలను తామే సేకరించి అమ్ముకునేలా చిత్తూరు జిల్లా మహిళా రైతులు తీసుకొన్న నిర్ణయం దేశంలోనే అతిపెద్ద రైతు ఉత్పత్తి సంస్థకు (ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ)నాంది పలికింది. ప్రపంచంలోనే మహిళలు నడిపిస్తున్న ఏకైక పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై అంచలంచెలుగా రాష్ట్రంలోని నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి విస్తరించింది.
ప్రతి దశలోనూ మహిళా పాడి రైతులే
మంది రైతులతో ఎనిమిదేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని తిరుపతి కేంద్రంగా శ్రీజ డైరీ ప్రారంభమైంది. పాడి పశువుల పెంపకం నుంచి షెడ్ల నిర్వహణ.. పాల సేకరణ, సరఫరా, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా ప్రతి దశలోనూ మహిళా పాడి రైతులే ఉండే నిబంధనలతో శ్రీజ డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా వడమాల పేట మండలం గుడిమల్లం గ్రామంలో ప్రారంభమైన క్షీర ఉద్యమం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లక్షా పాతిక వేల మంది మహిళా రైతులు భాగస్వాములను చేసింది. తమను తాము నిరూపించుకోవాలన్న తపన ఉన్న మహిళలు.. శ్రీజ డైరీ ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తున్నారు.
మహిళా ఆర్థిక స్వావంబలన దిశగా..
మహిళా ఆర్థిక స్వావంబలన దిశగా.. శ్రీజ డెయిరీ తీసుకున్న నిర్ణయాలను జాతీయ డెయిరీ అభివృద్ధి సంస్థ (NDDB) ప్రోత్సహిస్తోంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో..సహకార రంగంలో చిత్తూరు డెయిరీ పాడి రైతులకు సేవలు అందించేది. అనుకోని సంఘటనలతో చిత్తూరు డెయిరీ మూతపడటంతో ప్రైవేటు డెయిరీలు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోరయాయి. ఈ నేపథ్యంలో పాలను ఉత్పత్తి చేసే పాడి రైతులు భాగస్వాముల్యుగా, వాటాదార్లుగా సహకార సమాఖ్య స్ఫూర్తితో కంపెనీ చట్టాలకు అనుగుణంగా శ్రీజ పాల ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలు ఉత్పత్తి చేస్తున్న మహిళలు శ్రీజ డెయిరీ యజమానులుగా లాభాలను ఆర్జిస్తున్నారు.