చెగువేరాలోని తెగువ... ఐన్‌స్టీన్‌లోని తెలివి కలగలిపితే... జార్జ్‌రెడ్డి... అని అతని సన్నిహితులు చెబుతారు. ఆయన 25 ఏళ్ల వయస్సులోనే పాఠాలు చెప్పే ప్రొఫెసర్లకు చెమటలు పట్టించారు. భౌతికశాస్త్రం, గణితంలో అంత పట్టు ఆయనకు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. అదే పిచ్చి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ మెట్లు ఎక్కించింది. ఓసారి జార్జ్ పరీక్షా పేపర్లు దిద్దిన ముంబయికి చెందిన ప్రొఫెసర్... ఆయన్ని కలవడానికి ఉస్మానియాకు వచ్చారంటేనే జార్జ్ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. జార్జ్ బతికి ఉంటే... కచ్చితంగా భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించేవాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ్ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్ ఐదుగురు సంతానంలో జార్జ్‌రెడ్డి ఒకరు. 1947, జనవరి 15న కేరళలో పాలక్కాడ్‌లో జన్మించారు. 1962లో జార్జ్ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. హైదరాబాద్‌లోని సెయింట్ పాల్ స్కూల్‌లో జార్జ్ చదువు మొదలైంది. పీయూసీ (ప్రస్తుతం ఇంటర్), డిగ్రీ నిజాం కాలేజీలో చదివారు. పీజీ (ఎమ్మెస్సీ ఫిజిక్స్) ఉస్మానియాలో చదివారు. పీహెచ్‌డీ కోసం ఉస్మానియాలోనే చేరారు.
జార్జ్‌కు సమకాలిన అంశాలపై పట్టు ఎక్కువ. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తోటి విద్యార్థులతో చర్చించేవారు. అందరూ సమానంగా ఉండాలని ఆలోచించే జార్జ్... తనముందు జరిగే అన్యాయంపై స్పందించేవారు. ఆ గుణమే ఆయన్ని విద్యార్థి సంఘం నేతగా చేసింది. ఓసారి క్యాంపస్‌లో జరిగిన చిన్న గొడవ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ గొడవలో జార్జ్‌ను ఏడాదిపాటు రస్టికేట్ చేశారు.
విశ్వవిద్యాలయం నిర్ణయం... జార్జ్‌లో మరో కోణాన్ని పరిచయం చేసింది. బహిష్కరణకు గురైన ఏడాది పాటు జార్జ్... పుస్తకాలతో గడిపారు. విప్లవభావాలు నరనరాన ఎక్కించుకున్నారు. అప్పుడే పీడీఎస్‌యూ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం ప్యానల్ తరఫున వర్సిటీ ఎన్నికల్లో పోటీ చేయించే స్థాయికి తీసుకొచ్చారు.