ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిధులున్నా నిర్మాణాలు నిల్​.. కారణం అదేనా..! - చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులు

Chittoor district development works: నిధుల కొరత లేకపోయినా.. పట్టణ, నగర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగట్లేదు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో.. నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా చిత్తూరు జిల్లావ్యాప్తంగా నగర, పురపాలక సంస్థల పరిధిలో అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. పుష్కలంగా నిధులున్నా.. అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితిపై ప్రత్యేక కథనం

development works are not progressing
development works are not progressing

By

Published : Feb 14, 2022, 5:37 PM IST

నిధులున్నా.. నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాని గుత్తేదారులు.. కారణం అదేనా...

Chittoor district development works: చిత్తూరు జిల్లాలోని నగర, పురపాలక సంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. పూర్తి చేసిన పనుల బిల్లుల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన గుత్తేదారులు.. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అభివృద్ధి పనులు పడకేశాయి. పని ఏదైనా.. ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ అయినా.. టెండర్లపై గుత్తేదారులు ఆసక్తి చూపటం లేదు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రత్యేకంగా దాదాపు 180 కోట్ల రూపాయల నిధులున్నా.. వాటి వినియోగంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు...

కైలాసపురం ప్రధాన శ్మశాన వాటికలో విద్యుత్ దహనవాటిక పనులు ప్రారంభం కాగా.. బిల్లులు రాకపోవడంతో.. గుత్తేదారు పనులు నిలిపివేశారు. పుత్తూరు పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల కోసం ఏడాది క్రితం టెండర్లు పొందిన గుత్తేదారులు.. ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. పలమనేరు పురపాలక సంఘం పరిధిలో రోడ్డు నిర్మాణ పనుల్ని సగంలో ఆపేశారు. వీటితోపాటు అనేక ప్రాంతాల్లో రహదారులు, మంచినీటి పైప్‌లైన్ విస్తరణ పనులు, మురుగు కాలువల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆయా ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోపు నిధులు ఖర్చు చేయలేకపోతే.. వెనక్కు మళ్లే అవకాశం ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఏడేళ్ల నుంచి కుళాయిలు, మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణాలు ఏమీ చేపట్టలేదు. రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా అభివృద్ధి పనులు మాత్రం ముందుకు జరగటం లేదు. ఓట్ల కోసం వచ్చినప్పుడు కాలువలు కట్టిస్తామంటారు. తరువాత ఇటువైపు చూడటంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి..అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాము. - గ్రామస్థులు

ఇదీ చదవండి

బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కిదాంబి శ్రీకాంత్‌కు 5.5 ఎకరాల భూమి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అభివృద్ధి పనులు.. నమూనాల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details