ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'20 రోజుల్లో ఇంటికి వస్తానన్నాడు... అవే ఆఖరి మాటలయ్యాయి'

మరో 20 రోజుల్లో ఇంటికి వస్తానని ఆ జవాను కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పిన మాటలే చివరి మాటలయ్యాయి. ఫోన్ చేసిన మర్నాడే ముష్కరులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను వీరమరణం పొందాడు. జమ్ముకశ్మీర్ మాచిల్ సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలొదిలిన చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లికి చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ విషాద కథ ఇది.

By

Published : Nov 9, 2020, 4:33 PM IST

Updated : Nov 9, 2020, 5:58 PM IST

soldiers praveen kumar family
soldiers praveen kumar family

ప్రవీణ్ ‌కుమార్‌ గ్రామంలో విషాదఛాయలు

జమ్ము-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ సైనికాధికారి, బీఎస్​ఎఫ్ జవాన్ సహా మరో ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36) ఉన్నారు.

ప్రతాప్ రెడ్డి, సుగుణమ్మలకు ఏకైక సంతానం ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఇంటర్మీడియట్ వరకూ ఐరాల జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత చిత్తూరులో నిర్వహించిన సైనికుల ఎంపిక పోటీలో పాల్గొని 2002లో జవాన్​గా ఆర్మీలోకి అడుగుపెట్టాడు. 18వ రెజిమెంట్​లో విధులు నిర్వహిస్తూ దేశంలో పలు ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద సేవలందించాడు. అనతికాలంలోనే హవల్దార్​గా, కమాడెంట్ స్థాయికి ఎదిగాడు. జమ్ముకశ్మీర్​లో కుప్వారా జిల్లాలో విధులు నిర్వహిస్తూ..ఆదివారం జరిగిన ముష్కరుల దాడిలో వీరమరణం పొందాడు.

ప్రవీణ్ కుమార్ భార్య రజిత, తన 8ఏళ్ల కుమార్తె, 7ఏళ్ల కుమారుడితో కలిసి రెడ్డివారిపల్లెలోనే ఉంటోంది. ఏటా దీపావళి పండగకి వచ్చి పిల్లలతో ఆనందంగా గడిపే ప్రవీణ్...కరోనా కారణంగా ఈ సారి రాలేనని చెప్పాడు. ఈ విషయమే ఆఖరి సారిగా శుక్రవారం అమ్మ సుగుణమ్మతో, శనివారం తన భార్యతో మాట్లాడి వాళ్లకి సర్ది చెప్పాడు. మరో 20 రోజుల్లో తిరిగి వస్తానని సంక్రాంతి పండగ వరకూ పిల్లలతోనే గడుపుతానని మాటిచ్చాడు. అవే ఆఖరి మాటలయ్యాయని అతని భార్య రజిత కన్నీటి పర్యంతమయ్యారు.

సైనికుడి కుటుంబానికి దక్కని పరామర్శ

దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అధికారులు, నాయకులు ఎవరూ రాకపోవటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ప్రవీణ్ మృతి వార్త ఆదివారం రాత్రే తెలిసినా సోమవారం మధ్యాహ్నం వరకూ కూడా పరామర్శకు ఎవరూ రాకపోవటంపై బంధువులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం కుటుంబాన్ని వదిలి ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడికి కనీస గౌరవం ఇవ్వకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రవీణ్‌ తండ్రి కోరుతున్నారు. అమరవీరుడు ప్రవీణ్ భౌతికకాయం మంగళవారం రాత్రికి రెడ్డివారిపల్లెకు చేరుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

వీర మరణం చెందిన జవాన్లకు చంద్రబాబు నివాళి

Last Updated : Nov 9, 2020, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details