Snake bites: ఓ కుటుంబాన్ని పాము పగబట్టినట్లు ఉంది. ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులను నెలలో ఆరు సార్లు కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం మరోసారి అదే కుటుంబంలో ఇద్దరు పాము కాటుకు గురై చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం డోర్ణకంబాల పంచాయతీకి చెందిన వెంకటేష్, వెంకటమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు జగదీష్‌తో పాటు డోర్ణకంబాల గ్రామానికి చివరన గల కొండకింద భాగాన జీవిస్తుంటారు.
అయితే గత నెలలో వెంకటేష్, వెంకటమ్మ, జగదీష్‌లను రెండేసి సార్లు పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి 108 కాల్ చేసి.. ఆసుపత్రికి తరలిస్తుంచడంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రాంతంలో వారికి పాముల బెడద ఉన్నప్పటికీ... బతుకుదెరువును వదులుకొని వెళ్లలేక అక్కడే జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకటమ్మ, జగదీష్‌లను సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాము కాటేసింది. మళ్లీ స్థానికులు 108కి కాల్ చేసి.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాముల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.