Sid Naidu: బెంగళూరు కేఆర్ పురం బస్టాండు. వేసవి సెలవుల తర్వాత ఆ రోజే కాలేజీలు తెరిచారు. నా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడికి నా స్నేహితులిద్దరు- మూణ్నెల్ల క్రితందాకా నాతోపాటు బడిలో చదువుకున్నవాళ్లు వచ్చారు. ఆ మిత్రుల్ని చూడగానే నా ముఖం వెలిగిపోయింది. ‘హాయ్... రా!’ అంటూ ఆనందంగా పలకరించబోయాను కానీ వాళ్లు అదేదీ పట్టనట్టు ‘ఏరా... చదువుమానేశావటగా!’ అన్నారు నిర్లక్ష్యంగా చూస్తూ... అదేదో నా పాపం అన్నట్టు. ఆ ప్రశ్నతో పాలిపోయిన నా ముఖాన్నీ, రాలుతున్న కన్నీళ్లనీ చూపించడం ఇష్టంలేక ‘అవును... రా!’ అన్నాను తలొంచుకుని. అలా వంచిన తలని బస్సు వచ్చేదాకా పైకెత్తలేదు. బస్సులోకి వెళితే అందులో దాదాపు అందరూ నాతో చదువుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరూ నన్ను అదే ప్రశ్న అడిగినవాళ్లే. నేను జవాబు చెప్పాక... వాళ్లలో ఎవరూ నాతో మళ్లీ మాటలు కలపలా. నేనక్కడ లేనట్టే... ప్రవర్తించసాగారు. నేను పలకరించినా పట్టించుకోలేదు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. ఏడుపుని నొక్కిపడుతూ బస్సు నుంచి అర్థాంతరంగా దిగిపోయాను. బహుశా... నేను దిగిపోయింది కేవలం బస్సు నుంచే కాదు శాశ్వతంగా చదువులమ్మ ఒడి నుంచి కూడా అన్న నిజం అర్థమైపోయిందేమో... ఇక ఏడుపుని ఆపడం నా వల్ల కాలేదు. 2007లో ఈ సంఘటన జరిగితే... 2017కల్లా నేనో సొంత యాడ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాను. ఆ పదేళ్లే ఇప్పటి నా జీవితాన్ని నిర్దేశించాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు...
మా అమ్మానాన్నలది చిత్తూరు. ఎప్పుడో పొట్టచేతపట్టుకుని బెంగళూరుకి వచ్చేశారట. నాన్న కుమార్ నాయుడు బెంగళూరులోని ఓ ఆర్టీఓ కార్యాలయంలో బ్రోకర్‌గా కుదురుకున్నారు. ఆ ఉద్యోగంతోపాటూ అలవాటైందేమో తెలియదు కానీ... తాగుడుకి బానిసైపోయాడు. దానికి సిగరెట్టూ జతకలిసి 45 ఏళ్లకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. లివర్ పూర్తిగా దెబ్బతిని మంచానపడ్డాడు. మా అమ్మ మీరాకి- ఆయనకు సపర్యలు చేయటంతోనే సరిపోయేది. దాంతో నాకన్నా ఆరేళ్ల చిన్నవాడైన నా తమ్ముడు కిరణ్ బాధ్యతలు నేనే చూసేవాణ్ణి. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను... బడిలో మధ్యాహ్నం లంచ్ చేస్తుండగా మా పక్కింటాయన వచ్చాడు. రావడంతోనే ‘నాన్నకి ఆరోగ్యం బాగా పాడైపోయింది బాబూ... అర్జెంటుగా రండి!’ అన్నాడు. ఎల్‌కేజీ చదువుతున్న నా తమ్ముణ్ణి చంకనెత్తుకుని... బయల్దేరాను. మా వీధిలోకి అడుగుపెట్టేసరికే... నాన్న పోయారని అర్థమైపోయింది. చావంటే అర్థమయ్యీ కానీ ఆ వయసులో అమ్మని నేనే ఓదార్చాల్సి వచ్చింది. కర్మకాండలు పూర్తయి... దుఃఖం కాస్త ఉపశమించగానే... ఆకలి బాధ మొదలైంది. మా కడుపులు నిపడంకోసం- అప్పటిదాకా ఇల్లుదాటని అమ్మ ఓ ఇంట్లో వంటమనిషిగా కుదిరింది. ఆ ఇంటివాళ్లే నా స్కూల్ ఫీజు కడతామని ముందుకొచ్చారు. మరో బంధువు మా తమ్ముడి చదువుకి అవసరమైన డబ్బుని సర్దడం మొదలుపెట్టారు. అలా ఎంతకాలమని అనుకుందేమో అమ్మ... వంట మనిషిగానే కాకుండా దొరికిన పనులన్నీ చేసింది. ఓ స్కూల్లో పారిశుద్ధ్య కార్మికురాలిగానూ మారింది. నేనూ ఉదయం పేపర్‌బాయ్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. ఈ డబ్బుతోనే తమ్ముడికీ, నాకూ స్కూలు ఫీజులు కడుతుండేవాణ్ణి. అంతటితోనే ఆగిపోకూడదు అనిపించి... అమ్మతోపాటూ నేనూ పనిచేసి తమ్ముణ్ణి బాగా చదివించాలనుకున్నాను. అందుకే చదువుమానేస్తానని మొండికేశాను. తనూ ఒప్పుకోక తప్పని పరిస్థితి. అలా పనికెళ్లిన మొదటిరోజే బస్సులో స్నేహితుల నుంచి నాకు ఆ అనుభవం ఎదురైంది.
తొలి మలుపు...
నేను తొలిసారి పనికి కుదరింది ఓ ఆడిటింగ్ కంపెనీలో... ఆఫీస్‌బాయ్‌గా. ఆ సంస్థ మేమున్న ప్రాంతానికి చాలాదూరంలో ఉండేది... మూడు బస్సులు మారి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం ఎనిమిదికి బయల్దేరితే... రావడానికి రాత్రి ఎనిమిదయ్యేది. ఒక నెలపాటు ఉత్సాహంగానే పనిచేశాను కానీ... ఆ తర్వాత నా ఆరోగ్యం దెబ్బతింది. కోలుకోవడానికి పదిరోజులు పట్టింది. అమ్మ డాక్టర్ దగ్గరకి తీసుకెళితే ‘పసివాడుకదమ్మా! అంతంతసేపు ప్రయాణాలని శరీరం తట్టుకోలేకపోతోంది. వాణ్ణి చదువుకోనివ్వండి...’ అన్నారు.
అమ్మా అదే మాట అన్నా నేను ఒప్పుకోలేదు. పైగా, మా ఇంటి దగ్గర కొత్తగా ఓ సూపర్‌మార్కెట్ తెరిస్తే ‘ఉద్యోగం ఇవ్వండి!’ అంటూ వెళ్లాను. నాన్న చనిపోవడం, అమ్మ కూలీపనులతో ఒళ్లు గుల్లచేసుకోవడం... అన్నీ అక్కడి మేనేజర్‌కు వివరించాను. అంతా విని జాలిపడ్డారుకానీ... నాకు పదహారేళ్లే కాబట్టి పనిలోకి తీసుకోలేమని చెప్పారు. ఉసూరుమంటూ బయటకు వస్తున్న నన్ను ఓ వ్యక్తి ఆపాడు. ప్రకాశ్ అన్న అతను ఈ సూపర్‌మార్కెట్‌లోని ఓ చిన్న స్థలంలో ‘డెయిలీ బ్రెడ్’ పేరుతో కాఫీ షాపుని నడుపుతుండేవాడు. నా కథ అతనూ విన్నాడేమో ‘ఇందిరా నగర్‌లో ఉన్న మా కాఫీ షాపులో చేరు!’ అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పటికప్పుడే వెళ్లి వెయిటర్‌గా చేరిపోయాను. ఎవ్వరూ లేకున్నా షాపుని కనిపెట్టుకుని ఉండటం, కస్టమర్ లతో చక్కగా మాట్లాడగలగడం, అప్పగించిన పనుల్ని నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయడం... నాలోని ఈ క్రమశిక్షణ వాళ్లకి బాగా నచ్చినట్టుంది. చేరిన ఏడాదికే నన్ను క్యాషియర్‌ని చేశారు. ఆ కాసింత ప్రగతి... నాకిచ్చిన ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత నా ఎదుగుదలకి కావాల్సిన మనోబలాన్ని అదే ఇచ్చిందని చెప్పాలి. నాకు ఉద్యోగం ఇచ్చిన ప్రకాశ్ వేరే సంస్థకి మారుతూ నన్నూ అక్కడికి తీసుకెళ్లాడు. కానీ... ఈ కొత్తచోటకి వెళ్లిన ఆరునెలల్లోనే సంస్థ మూతపడిపోయింది. ‘ఐరన్ లెగ్’ అనుకోలేదు ప్రకాశ్... వాళ్లావిడ ద్వారా నాకు డాబర్ సంస్థవాళ్ల ‘న్యూ యూ’ ఔట్‌లెట్‌లో ఉద్యోగం ఇప్పించాడు. నా కెరీర్ ప్రయాణం మొదటి మలుపు తిరిగింది అక్కడే...
ఫ్యాషన్ రంగంవైపు...