చిత్తూరు జిల్లాలో నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ ప్రమేయం లేకుండానే నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు
ప్రకటించారంటూ.. చంద్రగిరి, రేణిగుంట మండల కార్యాలయాల ఎదుట అభ్యర్థులు ఆందోళన చేశారు. ఉపసంహరణ పత్రాల్లో తాము సంతకం చేయకుండా.. పోటీ నుంచి తప్పుకొన్నట్లు ఎలా ప్రకటిస్తారంటూ.. నిరసన తెలిపారు. సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయంటూ.. మండల కార్యాలయాల వద్ద అభ్యర్థులు ఆందోళన చేశారు.
ఇక చంద్రగిరి మండలం ఎ.రంగంపేట నామినేషన్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. కొట్టాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి సరస్వతమ్మ.. ఆర్.ఓ ఎదుట నిరసనకు దిగారు. నామినేషన్ పరిశీలనలో ఉన్న తన పేరును.. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత తొలగించారని ఆమె ఆరోపించారు. ఆర్వో సుమలత సమాధానం చెప్పకుండా కారులో వెళ్లి పోయారని..తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైకాపా మద్దతుదారుల నామినేషన్ల ఉపసంహరణకు.. నిర్ణీత సమయం దాటాక ఎలా అనుమతి ఇస్తారంటూ.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద తెదేపా నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం టి.వెలమవారిపల్లె పంచాయతీలో.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేసిన నామినేషన్లన్నీ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక రద్దైనట్లు అధికారులు ప్రకటించారు. సర్పంచ్ అభ్యర్థి ఎంపికలో గ్రామస్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరకే.. ఈ పరిస్థితి తలెత్తింది. ఇక ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలో.. తమకు రక్షణ కల్పించాలంటూ ఓ వర్గం పోలీసులను ఆశ్రయించింది. అధికార వర్గానికి చెందిన వ్యక్తి.. పంచాయతీ ఎన్నికలలో ఓడతాడనే భయంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ.. ఆందోళనకుదిగారు. మరోవైపు.. ఈనెల 21న జరిగే గన్నవరం పంచాయతీ ఎన్నిక.. ఆసక్తిగా మారింది. వైకాపా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలేటి మనోజ్ఞ.. తెదేపా ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు సమక్షంలో తేదేపాలో చేరారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ప్రారంభమైన మూడో దశ పోలింగ్