ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

National Best Teachers: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా.. రాష్ట్రం నుంచి ఇద్దరు!

విశాఖ, చిత్తూరు జిల్లా వాసులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2021కు ఎంపికైన వారి పేర్లను కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 44 మంది ఉండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురికి చోటు లభించింది.

By

Published : Aug 19, 2021, 9:49 AM IST

Selected as National Best Teachers
Selected as National Best Teachers

బడి ఆహ్లాదకరంగా ఉంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే భావన ఒకరిది.. భయాన్ని తొలగిస్తే గణితంలో మార్కులు కొల్లలే అనే నమ్మిక మరొకరిది.. తమదైన మార్గంలో ప్రత్యేక ముద్రవేస్తూ ముందుకుసాగారా ఉపాధ్యాయులు. స్ఫూర్తిదాయక ఫలితాల్ని సాధించి తోటివారిలో ప్రేరణ కలిగిస్తున్నారు. వారే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఫణిభూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు జిల్లా వాసి మునిరెడ్డి. వీరి సేవలకు గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించాయి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2021కి ఎంపికైన వారి పేర్లను కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 44 మంది ఉండగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురికి చోటు లభించింది. పురస్కారం కింద ఒక్కొక్కరికీ రూ.50 వేల నగదు, పతకం, ప్రశంసపత్రాలను సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందిస్తారు.

బడులన్నీ నందన వనాలే..

కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ది విశాఖ జిల్లా అనకాపల్లి. ప్రస్తుతం ఎస్‌.రాయవరం మండలం లింగరాజుపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌. 24 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ)గా పని చేసినప్పుడు పర్యావరణ సంరక్షణ, సామాజిక నర్సరీలు, ఘన వ్యర్థాల నిర్వహణ, దాతల విరాళాలతో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంఖ్య పెంపునకు చేసిన కృషికి గుర్తింపుగా ఫణిభూషణ్‌ శ్రీధర్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. నక్కపల్లి మండలం అయ్యన్నపాలెంలో 1997లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా చేరిన ఆయన ఐదేళ్లకే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్నారు.

ఇప్పటి దాకా వివిధ అంశాల్లో 43 అవార్డులను పొందారు. ఎక్కడ పనిచేసినా ఆ బడిని నందనవనంగా తీర్చిదిద్దుతారు. పాఠశాల అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేస్తుంటారు. బడిలో ఆహ్లాదకర వాతావరణం ఉంటే విద్యార్థులను ఆకట్టుకోవచ్చన్నది ఆయన భావన. పలు గ్రామాల్లో నాటికలు, కళాజాత నిర్వహించారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను సేంద్రియ ఎరువులతో బడుల ప్రాంగణాల్లో పండించడంలో కృషి చేశారు. అనకాపల్లి మండలం మూలపేట బడిలో ఫణిభూషణ్‌ శ్రీధర్‌ వెళ్లే సమయానికి 18 మంది విద్యార్థులు ఉండగా.. ఆ సంఖ్యను 52కు పెంచారు. దాతల నుంచి రూ.5.5 లక్షలు సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించారు. గత జనవరిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు.

భయం పోగొట్టి.. మార్కులు రాబట్టి..

విద్యార్థుల్లో గణితమంటే ఉండే భయాన్ని పోగొట్టి, వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేస్తున్నారు.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం.పైపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఎస్‌.మునిరెడ్డి. విద్యార్థుల్లో లెక్కలంటే భయం పోగొట్టేందుకు ప్రాథమిక భావనలను తేలికగా నేర్పిస్తారు. నిత్యం అదనపు తరగతులూ నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాదీ విద్యార్థులందరికీ గణితంలో వందశాతం మార్కులు రావడం విశేషం. మునిరెడ్డి స్వస్థలం సోమల మండలం కమ్మపల్లె. నిరుపేద రైతు కుటుంబం. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తమిళనాడు మద్రాసు యూనివర్సిటీలో బీఈడీ పట్టా పొందారు. ఉపాధ్యాయుడిగా ఎంపికై ఐరాల మండలం పందికొట్టూరు పాఠశాలలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

గణితంలో ఎంఎస్సీ, సైకాలజీలో ఎంఎస్సీ, ఎంఏ ఆంగ్లం, ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఈడీ, ఎంఫిల్‌, తిరుపతి ఎస్వీయూలో పీహెడీ పట్టా పొందారు. ఐరాల మండలంలోని పొలకల, పాకాల మండలంలోని దామల్‌చెరువు, పూతలపట్టు పాఠశాలల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. దాతల సహకారంతో విరాళాలు సేకరించి తాను పనిచేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో తనవంతు కృషి సాగించారు. ఆయన 32 సంవత్సరాల సర్వీసులో చాలా తక్కువ సెలవులు తీసుకున్నారు. గత నాలుగేళ్లలో తల్లి, చిననాన్న చనిపోయినప్పుడు మాత్రమే సెలవులు పెట్టారు. ఈ సేవలకు గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగానూ ఎంపికయ్యారు.

ఇదీ చదవండి:

paddy project: గిరిజన అభివృద్ధికి కేంద్రం చర్యలు .. రూ. 242 కోట్లతో పాడి ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details