కలియుగ వైకుంఠనాథుడు శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో మరే పుణ్యక్షేత్రంలో లేని విధంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి సేవలో పాల్గొంటారు. నెలల నిండిన చిన్నారి నుంచి పండుముసలి వరకు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు తితిదేతో పాటు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
తిరుమలలో భద్రతపై దృష్టిసారించిన అధికారులు...భక్తులు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారిలో చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లటం వంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి విడతో భాగంగా ఆలయం, మాడవీధులతో పాటు తిరుమలలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో అత్యంత ఆధునికమైన 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండో ఫేజ్‌లో మరో 1050 కెమెరాలు అమర్చుతున్నారు. దీంతో తిరుమల అత్యంత ఆధునిక సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి రానుంది. ముఖాలను గుర్తించే సాంకేతికత, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.