వ్యాక్సిన్ కోసం వచ్చినవారి మాటల్లో.. వ్యాక్సిన్ కొరత.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను వేధిస్తోంది. నేటి నుంచి రెండో డోస్ టీకా వేస్తారన్న అధికారుల ప్రకటనతో.. వేలాదిగా జనాలు కేంద్రాలకు తరలివెళ్లారు. భారీ క్యూలతో.. వ్యాక్సిన్ కేంద్రాలు రద్దీగా మారాయి.
ప్రకాశం జిల్లాలో...
ఇవాళ్టి నుంచి రెండో డోసు మాత్రమే వేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో... ఇదివరకే తొలిడోసు వేసుకున్నవాళ్లంతా టీకా కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచే బారులు తీరారు. గత కొద్దికాలంగా రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు... ప్రత్యేక టీకా కార్యక్రమానికి పోటెత్తుతున్నారు. ప్రకాశం జిల్లాలో కొవాగ్జిన్ కోసం వస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా జిల్లాకు 6 వేల డోస్‌లు వచ్చినట్లుగా అధికారులు చెప్పారు. 7 వేల కొవిషీల్డ్ డోసులూ వచ్చాయని తెలిపారు. వీటినీ రెండో డోసుగానే వేస్తామని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో..
మదనపల్లెలో రెండో డోసుల కోసం వందలాదిమంది పోటెత్తారు. కరోనా నిబంధనలు పాటించకుండా.. గుంపులుగుంపులుగా క్యూలో ఉండటంతో.. కొవిడ్ వస్తుందేమోనని వృద్ధులు భయపడుతున్నారు. రామారావు కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద... కొవాగ్జిన్ డోసులు తక్కువగా వచ్చినప్పటికీ... రెండో డోసు కోసం గత కొద్దిరోజులుగా వేచి ఉన్నవాళ్లంతా టీకా కోసం పోటెత్తుతున్నారు. దీంతో టీకా కేంద్రం వద్ద రద్దీ ఏర్పడింది. వారిని పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. కరోనా నిబంధనలు గాలికొదిలేయటంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీకా కోసం జనం తిప్పలు పడ్డారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాఠశాలలో... కోవ్యాక్సిన్ రెండో డోసు వేస్తారని..రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సమాచారం ఇచ్చారు. వారంతా ఉదయం ఆరు గంటల సమయానికి పాఠశాల వద్దకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తరలివచ్చిన వారంతా బారులు తీరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బాలుర ఉన్నత పాఠశాలకు మార్చామని చెప్పడంతో వారంతా.. అర కిలోమీటరు దూరంలోని పాఠశాలకు ఉరుకులు పరుగుల మీద చేరుకున్నారు. అక్కడ కూడా వారికి తిప్పలు తప్పలేదు. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారిలో కొంతమందికి కూపన్లు పంపిణీ చేసి వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని చెప్పడంతో కూపన్లు దొరకని లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. అధికారుల అలసత్వం పట్ల లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. ఊరూరా నిరీక్షణలే!