తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామపంచాయతీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని సర్పంచ్ బడి సుధా యాదవ్ ఆరోపించారు. తిరుపతికి చెందిన సుమారు 30 మంది వ్యక్తులు ఆగస్టు మూడో తేదీ రాత్రి గ్రామంలో గొడవలు సృష్టించారన్నారు. తిరిగి 'మా గ్రామస్థులపై(16 మందిపై) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు.
డీఎస్పీ నాగ సుబ్బన్న ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టారు. అవన్నీ నిరాధార కేసులని సర్పంచ్ బడి సుధా యాదవ్ చెప్పుకొచ్చారు. గ్రామానికి చెందిన రమేష్ బాబు నాయుడు, రజని దంపతులు.. లక్ష్మీదేవమ్మ ఇంటిని రూ. 13 లక్షలకు కొనుగోలు చేశారని చెప్పారు. 17 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ చేయకుండా లక్షీ దేవమ్మ దంపతులు కాలయాపన చేస్తున్నారన్నారు. దీనితో బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోందని తెలిపారు.
లక్ష్మీదేవమ్మ భర్త అమర్నాథరెడ్డి.. తిరుపతికి చెందిన రౌడీషీటర్లను పురమాయించి ఆగస్టు 3వ తేదీన దాడికి పాల్పడ్డారని సర్పంచ్ ఆరోపించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయని తెలిపారు.