చిత్తూరు జిల్లాల్లో కరోనా ఆంక్షల నేపథ్యంలో సేవాకార్యక్రమాలకు దాతలు ముందుకు వస్తున్నారు. తిరుపతిలో పలు స్వచ్చంద సంస్థలు నిరుపేదలకు సరకులను అందిస్తున్నాయి. కర్నాల వీధిలో వైకాపా నాయకులు.. రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూలీ పనుల కోసం వచ్చి ఇరుక్కుపోయిన వారికి బియ్యం, పచ్చళ్లను అందించారు. మరో వైపు పల్లి వీధిలో తెదేపా నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా అలుపెరగకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి... వారికి నగదు ప్రోత్సాహాన్ని అందించారు.
చిత్తూరు జిల్లాలో 8 కేసులు నమోదు కాగా కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మొదట విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి మాత్రమే కరోనా పాజిటివ్ నమోదైంది. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లిన ముగ్గురికి పాజిటివ్ అని తేలడంపై అధికారులు అప్రమత్తమయ్యారు.