చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో తమిళ స్మగ్లర్ల అలజడి పెరుగుతోంది. కరోనాతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న శేషాచల అడవుల్లో మళ్ళీ స్మగ్లింగ్ పుంజుకుంటోంది. ఈ విషయంపై అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. తిరుపతి మంగళం సమీపంలో తిమ్మినాయుడు పాలెం బీట్ పరిధిలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్స్ బృందం మంగళం ఫారెస్ట్ గోడౌన్ వెనుక వైపు అడవుల్లో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లగా, దాదాపు 20 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కనిపించారు. వీరు పోలీస్ బృందాన్ని చూడగానే దుంగలను ఎక్కడివక్కడే వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.