ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తే అభివృద్ధి చేసేవారికే ఓటేవేసేవారు. కానుకలు, నగదు పంచడాలు అవేమి లేకుండానే సర్పంచులను ఎన్నుకుని గ్రామాలని బాగు చేసుకునేవాళ్లు. కానీ ఇప్పటి పంచాయతీ ఎన్నికలు అలా కనిపించడమే లేదు.
మాటే.. శాసనం..
తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి సర్పంచిగా 1967 నుంచి 1985 వరకు పని చేశా. సర్పంచి అనుమతి లేకుండా ఏ అధికారి గ్రామంలో అడుగుపెట్టేవారు కాదు. ఎన్నికలంటే అప్పట్లో గ్రామానికి ఏది అవసరమో అందరూ ముక్తకంఠంతో చెప్పే వాళ్లు. అందరిదీ ఒక్కటే మాట. ఎన్నికల సమయంలో ఎవరైతే గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారో వాళ్లకే పట్టం కట్టే వాళ్లు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాళ్లకే మళ్లీ అవకాశం. డబ్బు, మద్యం పంపిణీ, దాడులు ఇవన్నీ అప్పట్లో వీటి ఉండేవి కాదు. నాలుగు దశాబ్దాలుగా ఒక్క పోలీసు కేసు నమోదు కాలేదంటే అప్పట్లో గ్రామాలు ఎంత శాంతియుతంగా ఉండేవో తెలుస్తోంది.
- గుడ్లూరు చెంచురామానాయుడు(90)
సమష్టి నిర్ణయాలతో పనులు
వెదురుకుప్పం, న్యూస్‌టుడే: ప్రస్తుతం నా వయస్సు 87 సంవత్సరాలు.. 30 ఏళ్ల(1965-95) పాటు నేను ఏకగ్రీవ సర్పంచిగా పనిచేశాను. అప్పట్లో ఎన్నికలకయ్యే ఖర్చు చాలా తక్కువ. జేబులో రూ.50 నుంచి రూ.100 ఉంటే ఎన్నికల తంతు ముగిసేది. ఆరోజుల్లో పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులుండేవి కావు. ప్రజల సమష్టి నిర్ణయంలో పనులు చేసుకొనే వాళ్లం. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వెదురుకుప్పానికి ఏకగ్రీవ సర్పంచులే పనిచేశారు. ఇక్కడి ప్రజలు పార్టీలకతీతంగా అభ్యర్థిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
- శివశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచి, వెదురుకుప్పం
చేతులెత్తే విధానంతో...
‘ఒకప్పుడు గ్రామస్థులంతా ఐక్యంగా ఉండేవారు. రాజకీయ కక్షలు లేవు. రచ్చబండలపై కూర్చొని అందరూ చేతులెత్తి ఎన్నుకొన్నవాడే సర్పంచి. గ్రామాల్లో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కలిసిమెలిసి ఉంటున్న పల్లెల్లో ప్రశాంతత కొరవడింది. నా వయసు 102 ఏళ్లు. 1982 వరకు కంగుంది గ్రామ పంచాయతీ సర్పంచిగా నన్ను ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకుంటూ వచ్చారు. అప్పట్లో నాపై ఎవరూ పోటీ చేయలేదు. ప్రజలకు నావంతు సేవలు అందించా.
- పి.ఆర్.శ్యామన్న, మాజీ సర్పంచి, కంగుంది
కుటుంబాల మధ్యే పోరు
గతంలో పంచాయతీ ఎన్నికలు ప్రత్యేకంగా సాగేవి. ఆ సమయంలోనూ పోటీ తీవ్రంగా ఉండేది. అప్పట్లో పంచాయతీలు పెద్దవిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని చిన్నవిగా విభజించారు. ఆరోజుల్లో ఎన్నికల పోరు కుటుంబాల మధ్య జరిగేది. మంచితనానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. గ్రామపెద్దలు నిర్ణయం ప్రకారం ఓట్లు వేసే పరిస్థితి. ప్రస్తుతం కాలం మారింది. అన్నింటా రాజకీయాలు. డబ్బు, కులం అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. పార్టీల ప్రభావం కూడా ఎక్కువగా కన్పిస్తోంది.
- వి.వెంకటస్వామినాయుడు, కావూరివారిపల్లె,పెనుమూరు మండలం.
రూ.50 ఖర్చుతో సర్పంచినయ్యా..
ఆ కాలంలో డబ్బు కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇచ్చేవారు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓటు వేసి గెలిపించేవారు. ఎన్నికలు వస్తున్నాయంటే గ్రామంలో సమస్యల పరిష్కారానికి ఏమి చేస్తారని అడిగేవారు తప్ప డబ్బులు ఎంత ఇస్తారని అడిగేవారు కాదు.. బలవంతంగా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే రూ.2 ఇచ్చే వాళ్లు.. అది కూడా డబ్బు తీసుకున్న వారికి ఓటు వేయకుంటే ఓటర్లు నిజాయితీగా తిరిగి ఇచ్చేసేవారు. మొట్టమొదటి సారిగా రూ.50లు ఖర్చు చేసి సర్పంచిగా ఎన్నికయ్యా. చివరిసారి సర్పంచి ఎన్నికల్లో రూ.20వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది’.
- కల్లూరు సిద్ధారెడ్డి, మాజీ సర్పంచి, ఆరేపల్లి రంగంపేట
ఇదీ చూడండి.గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రగతి రథచక్రాలను నడిపించే శక్తిమంతుడు