తిరుపతిలోని ఆర్టీసీ బస్సులు తిరుపతి రిజియన్ పరిధిలో 14 డిపోల్లో 1498 బస్సులున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 5 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ రూ.2 కోట్లు రాబడి సాధించేది. మార్చి 20 నుంచి లాక్‌డౌన్‌తో మే 21వ తేదీ వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తిరిగి పరుగులు పెట్టేందుకు ముందుకు సాగుతున్నాయి.
బస్సుల్లో భౌతికదూరం ఎత్తివేత..
ఆర్టీసీ బస్సుల్లో భౌతిక దూరం పాటించే ఉత్తర్వులు ఎత్తివేస్తూ ఆదేశాలు అందాయి. రద్దీకి అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికులు నిలబడి వెళ్లేందుకు అనుమతించరు. ఇక కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరి రక్షణ చర్యలు వారు తీసుకోవాల్సిందే.
రోడ్లపైకి ఏసీ బస్సులు..
తిరుపతి రీజియన్‌లో ఏసీ బస్సుల డిపోగా ఉన్న మంగళం డిపోలో 12 అమరావతి, ఒక వెన్నెల, 7 ఇంద్ర, 4 కరోనా ఏసీ బస్సులు ఉన్నాయి. ఇందులో చెన్నైకి 9, బెంగళూరుకు 7, విజయవాడకు 5, హైదరాబాద్‌కు 3 నడుపుతున్నారు. బెంగళూరుకు గురువారం నుంచి రెండు ఇంద్ర ఏసీ బస్సులు వెళుతున్నాయి. చెన్నై, హైదరాబాద్‌లకు బస్సులు నడిపేందుకు అంతర్‌రాష్ట్ర ఒప్పందాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బస్సులను విజయవాడ, విశాఖ తదితర దూర ప్రాంతాలకు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఛార్జీలు తగ్గించి వెన్నెల స్లీఫర్ బస్సులను విశాఖకు నడిపేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
రద్దీకి అనుగుణంగా..
రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతర్‌రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు తెలంగాణ, తమిళనాడుతో రాష్ట్ర ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. లాభాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలకు ప్రజల సౌకర్యార్థం పల్లెవెలుగు బస్సులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - చెంగల్‌రెడ్డి, ఆర్‌ఎం, తిరుపతి
ఇదీ చదవండి