ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు - చిత్తూరు జిల్లా ఆర్టీసీబస్సులపై లాక్​ డౌన్ ప్రభావం

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆర్టీసీ ప్రగతి చక్రాలు కదిలేందుకు సిద్ధమవుతున్నాయి. పరిమిత సంఖ్యలో బస్సులు నడుపుకోవచ్చనే సంకేతాలతో... అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బస్టాండ్‌ ప్రాంగణాలు, బస్సుల్లో భౌతికదూరం, మాస్కుల నిబంధనలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రోడ్లపైకి రానున్న ఆర్టీసీ బస్సులు
సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రోడ్లపైకి రానున్న ఆర్టీసీ బస్సులు

By

Published : May 19, 2020, 3:20 PM IST

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రోడ్లపైకి రానున్న ఆర్టీసీ బస్సులు

లాక్‌డౌన్‌తో దాదాపు 2 నెలలు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్లపై తిరిగేందుకు సిద్ధమవుతున్నాయి. బస్సులు నడపొచ్చని ప్రభుత్వాల సంకేతాల ఆధారంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా సీట్ల మధ్య భౌతికదూరం ఉండేలా మార్పులు చేశారు.

ఇప్పటివరకూ కనీస సీటింగ్ ద్వారానే 50 మంది ప్రయాణీకులను చేరవేసిన బస్సులన్నీ... ఇకపై 20 నుంచి 25 మంది ప్రయాణికులకే పరిమితం కానున్నాయి. ఈ విధానాన్ని పక్కాగా అవలంబించేలా సీట్లు కేటాయింపులో మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇద్దరు ప్రయాణీకుల మధ్య ఒక సీటును మార్క్‌ చేయడం ద్వారా భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఓ వరుస సీట్లను తొలగించి.. మధ్యలో ఉండే సీట్లకు మార్కింగ్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు.

బస్టాండ్ ప్రాంగణంలోనూ ప్రయాణీకులు అనుసరించాల్సిన విధానాలను మార్చారు. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద గుమిగూడకుండా ప్రత్యేకంగా గడులు ఏర్పాటుచేశారు. డ్రైవర్లు, కండక్టర్లూ విధులకు హాజరయ్యే గదుల వద్ద ఇదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు కచ్చితంగా మాస్కులు ధరించేలా, శానిటైజర్‌ వాడేలా అవగాహన కల్పించారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల వివరాలు సేకరించి డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచనున్న అధికారులు ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాకే బస్సులోకి అనుమతించనున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,384 సర్వీసులతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులను చేరవేసే తిరుపతి ఆర్టీసీ రీజీయిన్‌ కూడా.... బస్సులు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. తిరుమల ఘాట్‌పై ప్రయాణించే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లన్నింటినీ కండిషనింగ్‌ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లుచేసింది.

ఇవీ చదవండి:

లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ పొదుపు చర్యలు

ABOUT THE AUTHOR

...view details