నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాళ్యం మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో వలసపల్లి, బోడెవాండ్లపల్లి, భాకరాపేటకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. రామచంద్రాపురంలోని రాయల చెరువు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి.. పునరావాస కేంద్రాలకు తరలించారు. చంద్రగిరిలో భీమా, స్వర్ణముఖి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
కొంగరవారిపల్లి-మామిడిమాగడ్డలకు వెళ్లేదారులు కొట్టుకుపోవడంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం నడింపల్లి గ్రామం నీట మునిగి జనజీవనం స్తంభించింది. అధికారులెవరూ తమ పరిస్థితిని పట్టించుకోవటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.