Road Accidents in the State: రాష్ట్రవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో కొంతమంది తిరుమల నుంచి వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి మృతి చెందారు. మరో ప్రమాదంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా.. తండ్రీ కుమారుడు మృత్యుఒడికి చేరారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు, తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా మరొకరు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా నగరి ధర్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని మద్దూరుకు చెందిన వారు కారులో తిరుమలకు వస్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. వీళ్లంతా ఆదివారం ఉదయం కారులో తిరుమలకు బయలుదేరారు. నగరి సమీపంలో ధర్మాపురం వద్ద.. తిరువతి వైపు వస్తున్న ఓ ట్యాంకర్.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను.. జేసీబీ సాయంతో పోలీసులు వెలికి తీశారు. అంతకు ముందు ఇదే లారీ మరో కారును ఢీ కొట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన నగరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తండ్రీ, కుమారుడు మృతి: ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాంపల్లికి చెందిన కుటుంబం గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మేశ్వర రావు (46) రామకోటేశ్వరరావు (70)లుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.