Road Accident at chittor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుఅయ్యింది. ఈ దుర్ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రెండేళ్ల పాప కూడా ఉంది. చనిపోయిన నలుగురినీ విశాఖ వాసులుగా గుర్తించారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
గోల్డెన్ టెంపుల్కు వెళ్తుండగా ఘటన..
ఇవాళ ఉదయం తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం వేలూరులోని గోల్డెన్ టెంపుల్కు వెళుతుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి తమిళనాడు రాష్ట్రం జాలరిపేటకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని.. వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో.. ఈ దారుణం జరిగింది.