విశాఖలో ఈనెల 14న శ్రీవారి కార్తిక సహస్ర దీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తితిదే జేఈవో బసంత్ కుమార్ తెలిపారు. తితిదే పరిపాలనా భవన సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ నిర్మూలనను కాంక్షిస్తూ నవంబరు 30న పరిపాలనా భవనం మైదానంలో కార్తిక మహాదీపోత్సవం వైభవంగా నిర్వహించామని గుర్తుచేశారు. అదే స్థాయిలో విశాఖలోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
వేదిక మీద వెయ్యి దీపాల నడుమ శ్రీవారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్త యాగం జరపాలని వివరించారు. భక్తి గీతాలాపన, అష్టలక్ష్మీ వైభవ నృత్యం, సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హారతి, నక్షత్ర హారతి, మంగళహారతి నిర్వహించేలా కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలన్నారు. తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే దీపోత్సవానికి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.