రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా భారీ భూ కుంభకోణం కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 2వేల 320 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యుల పేరుమీద మార్చుకొని రెవెన్యూ అధికారులకు దొరికిన వీఆర్వో గణేష్‌పిళ్లై…పలు అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గుర్తించింది. 2005లో రెవెన్యూ దస్త్రాల కంప్యూటరీకరణ సమయంలో భూ కుంభకోణానికి తెరలేపినట్లు తేలింది.
గణేశ్ పిళ్లై వెబ్‌ల్యాండ్ ప్రారంభ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ప్రభుత్వ భూములను మార్చుకున్నారు. మీసేవ, వెబ్‌ల్యాండ్‌లోకి నిక్షిప్తం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్నాళ్లు అక్రమాలు వెలుగులోకి రాలేదని అధికారులు తెలిపారు. భూములను కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకోవడానికి ఎస్టేట్ గ్రామాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూముల వివరాలు దస్త్రాల్లో ఉండడంతో ఎస్టేట్ గ్రామాలను ఎంచుకొని అక్రమాలు కొనసాగించారు. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ద్వారా సేకరించిన వివరాలతో అటవీ సమీప భూములు, గుట్టలను కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లోకి గణేశ్ పిళ్లై ఎక్కించుకొన్నారు.