Research Successful: ఒక పశువు నుంచే ఏడాదికి సరోగసీ (అద్దె గర్భం) ద్వారా 10-12 ఆడ దూడల్ని పుట్టించే ఓపీయూ-ఐవీఎఫ్ (ఓవెమ్ పికప్ త్రూ ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ - ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) విధానంపై తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు ఫలించాయి. తిరుమల శ్రీవారి సేవకు దేశవాళీ పశు ఉత్పత్తుల అవసరం ఉంది. దీంతో నాణ్యమైన దేశవాళీ పశువులను సమకూర్చుకునే క్రమంలో తితిదే సూచనల మేరకు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన ఓపీయూ-ఐవీఎఫ్ విధానంలో గతేడాది నవంబరు నుంచి జరుగుతున్న ప్రయోగాలు ఫలించాయి. ఒకే పశువు నుంచి సేకరించిన అండాలను 33 పశువుల్లో ప్రవేశపెట్టగా ఐదు గర్భం ధరించాయి. మరో ఎనిమిదింటిని పరీక్షించాల్సి ఉంది.
- ఓపీయూ- ఐవీఎఫ్ విధానం గురించి..
మంచి పాల దిగుబడి ఇచ్చే ఆరోగ్యవంతమైన మేలుజాతి పశువులను ఎంపిక చేస్తారు. అండోత్పత్తికి దోహదపడే సూదిమందు ఇచ్చి 5రోజుల తర్వాత పశువు గర్భకోశ ద్వారం నుంచి అల్ట్రాసౌండ్ సాంకేతిక పరిజ్ఞానంతో అండాలను సేకరిస్తారు. 24 గంటల తర్వాత వాటిని ప్రయోగశాలలో ఆడ దూడలనే ఇచ్చే వీర్యంతో ప్రయోగశాలలో ఫలదీకరించి 6-8 రోజులు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. పిండాలుగా మారాక.. అదే సమయంలో ఆ పిండాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సరోగసీ పశువుల్లో ప్రవేశపెడతారు. ఈ ప్రాజెక్టులో ఒకే పశువు నుంచి 39 అండాలను సేకరించి.. వాటి నుంచి 21 పిండాలను ఉత్పత్తి చేయడం మరో విశేషం. ఇందుకోసం తితిదే గోశాలలోని మేలుజాతి సాహివాల్ పశువులను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 7 పశువుల నుంచి 90 పిండాలను అభివృద్ధి చేసి 33 సరోగసీ పశువుల్లో ప్రవేశపెట్టి, మిగిలిన అండాలను నిల్వచేశారు. పరీక్షించిన 25 సరోగసీ అవులలో 5 పశువుల్లో 60-80 రోజుల చూడి నిర్ధారించారు.