ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రత్యేక దళం చెక్! - స్మగ్లర్లు

అత్యంత అరుదైన వృక్షసంపదకు నేలవైన రాయలసీమ శేషాచల అటవీ ప్రాంతానికి ఎర్రచందనం స్మగ్లర్ల చిక్కొచ్చి పడింది. అక్రమార్జనే లక్ష్యంగా కొనసాగుతున్న ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక కార్యదళం చేపడుతున్న కార్యచరణ ప్రణాళికలపై విశిష్ట కథనం మీ కోసం.

ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రత్యేక దళం చెక్!

By

Published : Feb 14, 2019, 6:41 AM IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్
ఎర్రచందనం..జౌషధ విలువల సమ్మిళితం. అత్యంత అరుదైన ఈ వృక్షానికి వైద్యరంగంలో ప్రత్యేక స్థానముంది. అందుకే ఈ వృక్షమంటే అక్రమార్కులకు అమిత ప్రేమ. రెడ్ శాండిల్, తిలాపర్ణి, సెమ్మారమ్ అని పిలుచుకునే ఈ ఎర్రచందనం చెట్లను కొట్టుకుపోడానికి రాష్ట్రాలు దాటివస్తుంటారు స్మగ్లర్లు. శేషాచల అటవీ ప్రాంతాల్లో విరివిరిగా లభించే ఈ చెట్లు అక్రమార్కుల పాలిట కల్పవృక్షాలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలికే ఈ కలపను అక్రమ రవాణా చేసేందుకు వివిధ దేశాల స్మగ్లర్లే రంగంలోని దిగుతుంటారు.

ఔషధాలు, సౌందర్య పోషక సాధనాలు, పూజా కైంకర్యాలు, ఖరీదైన కూర్చీల తయారీకి ఎర్రచందనాన్ని విరివిరిగా వాడుతుంటారు.

రాయలసీమ శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే ఈ అరుదైన వృక్షసంపదపై స్మగ్లర్ల కన్నుపడింది. కేవలం ధనార్జన లక్ష్యంగా ఇష్టానుసారంగా నరికేస్తూ విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ.. కోట్లు గడిస్తున్నారు. శేషాచలం అడవులు దట్టంగా ఉండడం వలన చెట్ల నరికివేతను అడ్డుకోవడం కష్టమారిందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యదళం ఏర్పాటుచేసింది. 2013లో ఏర్పాటయిన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్.. శేషాచల అటవీ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ చేపడుతూ విలువైన వృక్ష సంపదను కాపాడుతుంది. ఎర్రచందనం పరిరక్షణలో భాగంగా పట్టుబడిన కూలీలకు కౌన్సిలింగ్ ఇస్తారు. పెద్ద మొత్తంలో చెట్లు కొట్టేస్తే కేసులు నమోదు చేస్తారు. రేయింబవళ్లు పహారా కాస్తూ ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకుంటున్నారు.

అక్రమార్జనే లక్ష్యం చేసుకున్న స్మగ్లర్లు..కూలీలకు డబ్బు ఆశచూపిస్తున్నారు. పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని గ్రామాలు ప్రజలు స్మగ్లర్ల డబ్బుకు ఆశపడి ఎర్రచందనం చెట్ల అక్రమరవాణాకు సిద్ధపడుతున్నారు.

జావాదిమలై...ఏపీ-తమిళనాడు సరిహద్దులోని ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లింగ్ కూలీల నివాస ప్రాంతం. పేదరికం, ఉపాధిలేమి సమస్యలు ఎదుర్కొంటున్న ఈ గ్రామస్థులకు ఎన్నో ఏళ్లగా ఎర్రచందనం చెట్లు నరికివేత, రవాణాలనే వృత్తిగా ఎంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ బృందం ఈ గ్రామంలో పర్యటించి చెట్ల నరికివేతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమస్యపై తమిళనాడు ప్రభుత్వానికి లేఖలు రాశారు. గ్రామస్థులకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరారు. అటవీ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో కూలీలు రాక క్రమంగా తగ్గింది.

చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం వృక్షసంపదను రక్షించుకోవడానికి ప్రత్యేక కార్యదళం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా వాహనాలు వెళ్లకుండా 1500 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వింది. చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఎర్రచందనం అక్రమ రవాణా

ఒక పక్క పోలీసుల శాఖ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా...స్మగ్లర్లు అక్రమాలు ఆగడం లేదు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఎన్​కౌంటర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అరుదైన ఎర్రచందనం విలువను ప్రజలకు తెలియజేయడం, స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడం, కూలీలకు ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించడం వంటి చర్యలతో అత్యంత విలువైన ఈ వృక్షాలను భవిష్యత్ తరాలకు అందించగలం.

ABOUT THE AUTHOR

...view details