కర్ణాటకలో ఉంటూ.. తమ అనుచరులతో మన రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేస్తున్న.. ప్రధాన స్మగ్లర్ల ఆచూకీ లభించిందని ఏపీ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు వెంకటయ్య, గిరిధర్ చెప్పారు. తిరుపతిలోని ఏపీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
సోమవారం ఐతేపల్లె నుంచి కర్ణాటక సరిహద్దు వరకు వెంబడించి పట్టుకున్న స్మగ్లర్ల ద్వారా.. కర్ణాటకలోని బడా స్మగ్లర్ల ఆచూకీ లభ్యమైందన్నారు. ఐతేపల్లెకు చెందిన మునికృష్ణ.. గత కొన్నేళ్లుగా ఈ దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని చెప్పారు. ఇతడు మరికొంతమంది కూలీలను పెట్టుకుని ఎర్రచందనం దుంగలను సేకరించి.. బెంగళూరులోని ఇమ్రాన్‌ఖాన్, యాసిన్‌కు విక్రయిస్తున్నట్టుగా గుర్తించామన్నారు.
ప్రధాన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాన్ని బెంగళూరుకు పంపనున్నామన్న పోలీసులు.. సోమవారం పట్టుబడిన ఐదుగురు స్మగ్లర్లతోపాటు, మునికృష్ణ వద్ద పనిచేసే మరో ఏడుగురు స్మగ్లర్లు సైతం ఉన్నారన్నారు. వారిని సైతం త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. స్మగ్లర్లను వెంబడించి పట్టుకోవడంలో సాహసోపేతంగా వ్యవహరించిన ఆర్‌ఎస్సై వాసు, సురేష్ బృందానికి రాయలసీమ రేంజ్ డీఐజీ కాంతి రాణటాటా ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.