ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రుయా' మరణమృదంగానికి నిర్లక్ష్యమే కారణమా ? - reason of ruya hospital incident news

అసలే మహమ్మారి...శరీరాన్ని నరకయాతనకు గురిచేస్తోంది. ఊపిరి అందక పైప్రాణాలు పైనే పోతుంటే...కృత్రిమ శ్వాసే ఆధారంగా మారింది. అలాంటి దీనస్థితిలో వైరస్‌తో పోరాడుతున్న వారిని...కరోనాను మించిన నిర్లక్ష్యమే చిదిమేసినట్లు తెలుస్తోంది. ఉన్న ప్రాణమంతా బిగబట్టి ఊపిరి కోసం కొట్టుమిట్టాడినా లాభం లేకపోయింది.

reason of ruya hospital incident
'రుయా' మరణమృదంగానికి నిర్లక్ష్యమే కారణమా ?

By

Published : May 11, 2021, 5:08 AM IST

తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రి..రాయలసీమలోనే పెద్ద ఆస్పత్రుల్లో ఒకటి. మొత్తం వెయ్యి మంది రోగులకు చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో 700 వరకూ ఆక్సిజన్ పడకలే ఉన్నాయి. నిత్యం 30 మంది డ్యూటీ డాక్టర్లు...రోగులను పరిశీలిస్తూ ఉంటారు. ఇంత కీలకమైన చోట...ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపింది. రోగులు ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్న దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని...స్విమ్స్, రుయా ఆస్పత్రులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని...ఈ సమావేశాల్లో వైద్యులు కోరారు. అయినా సరే 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే వరకూ...ఆసుపత్రి సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడులోని శ్రీపెరంబూరు నుంచి ఉదయం రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్...సాయంత్రం వరకూ రాకపోయినా పర్యవేక్షించాల్సిన వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చేలోపు సిలిండర్ల ద్వారా ఊపిరి అందించేందుకు అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 5 నిమిషాలే జాప్యం జరిగిందని చెబుతుండగా...దాని ఖరీదు 11 ప్రాణాలుగా మారింది. 3 ట్యాంకులతో ఆక్సిజన్ సరఫరా నిర్వహిస్తున్న ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో వేరే ట్యాంకుల నుంచి ఆక్సిజన్ తీసుకొనే అవకాశం లేకపోవడమూ ప్రమాదానికి మరో కారణంగా తెలుస్తోంది. మంత్రుల సమీక్షా సమావేశాల్లో అన్నీ అందుబాటులో ఉన్నాయని ధీమాగా ప్రకటించిన జిల్లా ఉన్నతాధికారులు...ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ అవుతున్నా పట్టనట్టు ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. వచ్చిన ప్రతి రోగికీ అలుపెరుగక వైద్యం చేస్తున్న డాక్టర్లనే రోగుల బంధువులు తప్పుబడుతుండగా...అసలు నేరం అధికారులదేనని తెలుస్తోంది. జిల్లాలో ఉన్న కొవిడ్ రోగుల అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను ఇప్పటికైనా అధికారులు ముందస్తుగా అందుబాటులో ఉంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details