Ratna reddy: రత్నారెడ్డిది చిత్తూరు జిల్లా కొలమాసనపల్లె. చదివింది అయిదో తరగతి. 1964లో మెకానికల్ ఇంజినీర్ గంగిరెడ్డితో వివాహమైంది. ఆయనకు ఒడిశాలోని రవుర్కెలా స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం. అక్కడ అందరూ హిందీ, ఒడియా లేదంటే ఇంగ్లిష్ మాట్లాడేవారే! ఆవిడకేమో తెలుగు, తమిళం మాత్రమే వచ్చు. దీంతో కూరగాయలకూ ఇతరులపై ఆధారపడాల్సిందే. మూడేళ్లు గడప దాటడమూ కష్టమైంది.
తెలుగు నుంచి ఇతర భాషలు నేర్చుకునే పుస్తకాలు తెప్పించుకొని హిందీ, ఒడియా, ఇంగ్లిష్, బెంగాలీ భాషలు నేర్చుకున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటివి ముందే వచ్చు. చుట్టుపక్కల వారికి నేర్పడంతోపాటు ఆర్డర్లు తీసుకొని సంస్థలకు కుట్టివ్వడం మొదలుపెట్టారు. ఊహించని లాభాలొచ్చాయి. ఓసారి ఆవిడ స్వస్థలంలో విద్యార్థులు పైచదువులకు పక్క ఊళ్లకు వెళ్లాల్సి రావడం చూశారు.
‘ఇప్పుడు నాకు డబ్బుంది. కానీ చదువు లేక చాలా ఇబ్బందిపడ్డా. మా ఊరివాళ్లకి ఆ పరిస్థితి తప్పించాలనుకున్నా’అని చెబుతారు రత్నారెడ్డి.
వ్యాపారంలో లాభాలు, పొలం, బంగారం అమ్మగా వచ్చిన మొత్తంతో పలమనేరులో పన్నెండున్నర ఎకరాల్లో 1983లో డిగ్రీ కళాశాలను కట్టించారు. తండ్రి సాయం కోరగా రూ.లక్షన్నర డిపాజిట్ చేశారు. దాన్ని మూడు గదులతో మొదలుపెట్టి విస్తరిస్తూ వచ్చారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ను కలిసి ప్రభుత్వ గుర్తింపునూ సాధించారు. 12 ఏళ్లు ఒడిశా, రెండేళ్లు జర్మనీలో ఉన్న తర్వాత మద్రాస్ చేరుకున్నారు.
120 మందితో 1998లో హోసూరు(తమిళనాడు)లో ‘రత్న ప్యాకేజింగ్’ ప్రారంభించారు. వీళ్ల వస్త్రాలు విదేశాలకూ ఎగుమతి అయ్యేవి. గంగిరెడ్డి పదవీ విరమణయ్యాక సొంతూరుకు చేరుకున్నారు. ఈవిడకి ఆయుర్వేదం తెలుసు. అయిదుగురు తాతలకు ఒక్కతే మనవరాలు. దీంతో వాళ్లకు తెలిసిన గుర్రపుస్వారీ, ఈత, ఆయుర్వేదం, వాహనాలు నడపడం, గన్ షూటింగ్ వంటివి ఈమెకు చిన్నతనంలోనే నేర్పారు.
ఒడిశా, చెన్నైల్లో ఉన్నప్పుడూ ఆవిడ చుట్టుపక్కల వాళ్లకి ఆయుర్వేద వైద్యం చేసేవారు. సొంతూరుకొచ్చాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం చూసి రూ.10 కోట్లతో 2006లో ‘రత్నా బయోటెక్’ ప్రారంభించారు. అప్పటికి ఆమె వయసు 62 ఏళ్లు. తమ పొలంలో ఔషధ మొక్కలు పెంచుతూ.. నిపుణులను నియమించుకుని ఆయుర్వేద ఔషధాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.