మాఘ శుద్ధ సప్తమినాడు.. సూర్య జయంతిని పురస్కరించుకుని తితిదే ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహన సేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కన్నులపండువగా సాగాయి. మొదటగా స్వామివారు సూర్యప్రభవాహనంపై సూర్యనారాయణ మూర్తిగా ఊరేగుతూ వాయువ్య దిశకు చేరుకున్నారు. అక్కడ స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు.. కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించడంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి..
చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు
సూర్య ప్రభవాహన సేవ అనంతరం చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య చక్రతాళ్వార్లకు అభిషేకాదులు, దూప దీప నైవేధ్యాలను సమర్పించి.. పుష్కరస్నానం చేయించారు. కరోనా కారణంగా చక్రస్నానంను ఏకాంతంగా నిర్వహించారు.
కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీవారు..
ఉదయం పూట జరిగిన వాహన సేవల్లో మలయప్పస్వామివారు మాత్రమే దర్శనమివ్వగా.. మద్యాహ్నం తరువాత నిర్వహించిన కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో విశేషతిరువాభరణాలు, పరిమలభరిత పూల మాలలతో అలంకృతులైన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
చల్లని వెన్నెల్లో అభయప్రదానం..