తెలంగాణలో యువతి హత్య కేసుపై రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు చేపట్టారు. ఆడ పిల్లలను రక్షించాలంటూ నినాదాలు చేశారు.
విజయవాడలో ర్యాలీ
తెలంగాణలో యువతిపై హత్యాచారానికి నిరసనగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శారదా కళాశాల విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులో ...
హైదరాబాద్లో యువతి హత్యకు నిరసనగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నారై ఇండియన్ ప్రిన్స్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు ర్యాలీలో పాల్గొని సేవ్ గర్ల్ నినాదాలు చేస్తూ.. రోడ్లపై ప్రదర్శన చేపట్టారు. గుంటూరు నగరంలో నోటికి నల్ల రిబ్బన్లతో ర్యాలీ చేపట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే నిందితులకు అక్కడికక్కడే శిక్షలు పడాలని నినదించారు.