ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుకు భరోసా ఎక్కడ..? - raithu bharosa centers at tirupati news update

ప్రతి ఆర్​బీకే కేంద్రంలో కియోస్క్‌ యంత్రం ఏర్పాటు చేశారు. రైతుకు ఏం కావాలన్నా అందులో నమోదు చేసుకుంటే వివరాలన్నీ హబ్‌కు వెళ్తాయి. ఆన్‌లైన్‌ సరిచూసుకుని రైతు భరోసా కేంద్రాల వారీగా హబ్‌లో ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, విత్తనాలు కేటాయిస్తారు. 48 గంటల్లో వస్తాయని రైతు చరవాణికి సంక్షిప్త సందేశం పంపుతారు. అయితే రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

raithu bharosa centers
రైతుకు భరోసా ఎక్కడ..?

By

Published : Oct 16, 2020, 8:25 PM IST

Updated : Oct 16, 2020, 9:39 PM IST

రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)లో నాణ్యమైన విత్తనం సహా ఎరువులు, పురుగు మందులు ఇలా ఏది నమోదు చేసుకున్నా 48 గంటల్లో అందజేస్తాం.. రైతులెవరూ ఎక్కడా తిరగాల్సిన పనిలేదు.. అన్నీ గ్రామస్థాయిలోనే అందిస్తాం. - రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది

జిల్లాలో 66 మండలాల్లో 940 ఆర్‌బీకేలు ఉన్నాయి. అక్కడ యంత్రం, సిబ్బంది తప్ప ఏమీ ఉండవు. ఆర్‌బీకేలకు ఎరువుల సరఫరాకు ఆరు హబ్‌లు ఏర్పాటు చేశారు. ఎరువుల కోసం కియోస్క్‌ యంత్రం ద్వారా ఆన్‌లైన్‌లో రైతులు పేర్లు నమోదు చేసుకున్నా..సకాలంలో అందడం లేదు. లాజిస్టిక్స్‌ సంస్థకు రవాణా ఛార్జీల చెల్లింపులు ఆలస్యంతో ఎరువుల సరఫరా జాప్యమై అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు.

  • ఛార్జీలు చెల్లించకే సమస్య

ఆర్‌బీకేలకు ఏం కావాలన్నా చేర్చే బాధ్యత ఏపీ ఆగ్రోస్‌కు అప్పగించారు. హబ్‌ల నుంచి ఆర్‌బీకేలకు చేరవేయాలంటే రవాణా కోసం వాహనాలు నడిపేందుకు రాష్ట్రస్థాయిలో టెండర్లు నిర్వహించి ట్రాన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ సంస్థకు అప్పగించారు. రవాణా ఛార్జీలు చెల్లించకపోవడంతో సంస్థ ప్రతినిధులు 15 రోజులుగా ఎరువుల సరఫరాకు సరిపడే వాహనాలు సమకూర్చలేదు. నామమాత్రంగా 2-3 వాహనాలకే పరిమితం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం రవాణా ఛార్జీల సొమ్ము చెల్లించకపోవడంతో ఎరువుల రవాణాను పూర్తిగా నిలిపేశారు. ఆర్‌బీకేల్లో నమ్మకం లేక బహిరంగ మార్కెట్లో ఎరువులు తప్పనిసరై కొనుగోలు చేస్తున్నారు. ఛార్జీలు చెల్లించకపోవడంతో రవాణా ఆగిపోయిందని.. ఎరువులకు ఆన్‌లైన్‌లో నమోదు చేయవద్దని అధికారులే రైతులకు చెబుతున్నట్లు సమాచారం.

  • 500 మంది నమోదు

ఆర్‌బీకేల ద్వారా ఎరువుల కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎరువుల కోసం జిల్లా వ్యాప్తంగా 500 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నా.. రవాణా నిలిచిపోవడంతో వారికి ఇప్పట్లో అందేలా లేవు. జిల్లాలో 31వేల మంది రైతులకు రూ.5.61కోట్ల విలువైన ఎరువులు పంపిణీ చేశామని ఆగ్రోస్‌ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆర్‌బీకేల ద్వారా ఎరువులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

  • ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

లాజిస్టిక్స్‌ సంస్థకు రవాణా ఛార్జీల చెల్లింపులు ఆలస్యం కావడంతో ఎరువుల సరఫరా జాప్యమవుతోంది. ఈ అంశాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని జిల్లా జేడీఏ విజయకుమార్ తెలిపారు.

ఇవీ చూడండి...

భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం : కమిషనర్

Last Updated : Oct 16, 2020, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details