సూర్యజయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల, తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహనసేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కన్నులపండువగా సాగాయి. మొదటగా స్వామివారు సూర్యప్రభవాహనంపై సూర్యనారాయణమూర్తిగా ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు... కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించిన తర్వాత వాహన సేవలు ప్రారంభమయ్యాయి. చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు.
ఉదయం జరిగిన వాహన సేవల్లో మలయప్పస్వామి మాత్రమే దర్శనమివ్వగా.... మధ్యాహ్నం తరువాత కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయం సంధ్యవేళలో, చల్లని వెన్నెల సమయంలో చంద్రప్రభను అధిరోహించిన తిరుమలేశుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను ఆనందపరవశానికి గురి చేశారు.
రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను తిరిగి పునరుద్దరించారు.