Amaravati Farmers Mahapadayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 41వ రోజు శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరూ అమరావతి జెండాలను చేతబూని జై అమరావతి అంటూ ముందుకు సాగారు. రాచగున్నేరు, ఏర్పేడు, సీతారంపేట, అంజిమేడు ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున మహిళలు, స్థానికులు చేరుకుని వారికి హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. యాత్రకు కొందరు వైకాపా నేతలు సైతం మద్దతు తెలిపారు.
అమరావతి రైతులకు ఇతర ప్రాంతాల నుంచి సైతం వచ్చి మద్దతు తెలిపారు. పుణె, పింప్రి, బోసారి, చించువాడ్ ప్రాంతాలకు చెందిన రైతులు... రాజధాని అమరావతి పోరాటానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని..... అది అమరావతి కావాలని....నినదించారు. వీరితో పాటు మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగువారు సైతం తరలివచ్చి అన్నదాతలతో కలిసి నడిచారు.
అమరావతి రైతుల సంకల్పం ముందు వర్షం సైతం చిన్నబోయింది. రేణిగుంట-నాయుడుపేట మార్గంలో వర్షంలోనూ రైతులు యాత్ర కొనసాగించారు. టీఎమ్వీ కండ్రిగ, మిట్ట కండ్రిగ, చెర్లోపల్లి, తొండమనాడు ఆర్చీ, కాపుగున్నేరి, చల్లపాళెం, రాచగున్నేరి, మేర్లపాక, మన్నసముద్రం, ఏర్పేడు, సీతారామపేట, అంజిమేడులో స్థానికులు... పాదయాత్రకు మంగళహారతులతో స్వాగతం పలికారు. వర్షంలో తడుస్తూనే ఉత్సాహంతో పాదయాత్రలో భాగస్వాములయ్యారు.
ఉద్యమ పథంగా సాగుతున్న మహాపాదయాత్ర విజయవంతానికి అందరూ కలసి రావడం పట్ల రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ 42వరోజు మహాపాదయాత్ర అంజిమేడు వద్ద ప్రారంభమై రేణిగుంట వరకు సాగనుంది.
ఆటంకాలు కల్పించడం సరైంది కాదు:సీపీఐ రామకృష్ణ