చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఏజెంట్ల చేతిలో దగా పడుతున్న మహిళలు ఎందరో! తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్న వారు మాత్రం కొందరే. ఏజెంట్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భావించి ఎందరో లోలోన కుమిలిపోతున్నారు. కుటుంబ పరువు, ప్రతిష్ఠలు ఆలోచించి పోలీస్‌స్టేషన్‌కు రావడం లేదు. పశ్చిమ పల్లెల్లో వేల మంది బాధితులున్నా.. వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలో పోలీసు కేసులు నమోదవుతున్నాయి.
ఉన్నది పదుల సంఖ్యలోనే కానీ...!
జిల్లాలో లైసెన్స్‌డ్ గల్ఫ్ ఏజెంట్లు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. దీనిపై అధికారిక సమాచారం ఎక్కడా లేదు. ఎక్కువ మంది లైసెన్స్ లేకుండా.. వీసాల వ్యాపారం చేస్తున్నవారే. వీరు పశ్చిమ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో తమ మనుషులను నియమించుకొని మహిళలను గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. ఒక్క పీలేరులోనే అనధికారికంగా 200 మంది ఏజెంట్లు, మదనపల్లె, కురబలకోట, తంబళ్లపల్లెలో వందల్లో ఉన్నారు.
నరకకూపంలోకి పంపుతున్న ఏజెంట్లు
దేశం కాని దేశం.. అక్కడో దౌత్య కార్యాలయం.. అందులో 45 మంది మహిళలు.. ఒక్కరి ముఖంలోనూ ఆనందంలేదు. వారి కళ్లముందే ఎంతోమంది భారతీయులు అక్కడికి వస్తున్నారు.. ఆనందంగా స్వదేశానికి వెళుతున్నారు.. వారు మాత్రం కొన్ని నెలలుగా అక్కడే తలదాచుకుంటున్నారు. స్వదేశానికి వెళ్లాలనే ఆశ వారిలోనూ ఉంది.. కన్నవారిని, కనిపెంచిన బిడ్డలను, కట్టుకున్న భర్తను చూడాలన్న కోరిక ఉంది. అయితే వారి దగ్గర పాస్‌పోర్ట్‌లు లేవు. ఇప్పుడు వారు ఆ గల్ఫ్ దేశంలో అక్రమ వలసదారులు. పాస్‌పోర్టులు గుంజుకొని.. తిట్టి, కొట్టి.. నానాహింసలు పెట్టింది సేట్లు కాగా.. వారిని తెలిసీ.. నరకకూపంలోకి పంపింది ఇక్కడి ఏజెంట్లు. ఒమన్, కువైట్, సౌదీ, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో మగ్గుతున్న మహిళలెందరో గత కొద్ది రోజులుగా తమను ఇండియాకు పంపించాలంటూ ప్రభుత్వాలను మొరపెట్టుకుంటున్నారు. ‘ఈనాడు’ చిత్తూరు జిల్లా సంచికలో శనివారం ప్రచురితమైన ‘రాలిపోయిన మల్లికలెందరో.. రావాల్సిన రాధలెందరో’ కథనం చదివిన పాఠకులెందరో.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతంలోని గల్ఫ్ ఏజెంట్ల మోసాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. వందలాది మంది తెలిసీ తెలియక ఏడారి బాట పట్టారని.. ఎండమావుల్లో నీళ్లు చూపించి మోసగించిన ఏజెంట్లు మాత్రం ఇక్కడ దర్జాగా గడుపుతున్నారంటూ వాపోయారు.
అవసరాలను సొమ్ముగా చేసుకుంటున్నారు...
అసలే కరువు ప్రాంతం. సాగుబడి లేదు. చేతిలో పనిలేదు. సంసారం నెట్టుకురావాలంటే ఏదో బతుకుదెరువు వెతుక్కోక తప్పని పరిస్థితి. ఈ అవసరాన్నే సొమ్ము చేసుకుంటున్నారు మోసకారి గల్ఫ్ ఏజెంట్లు. అక్కడి దేశాల్లో ఇళ్లలో పనిమనుషులుగా, ఆయాలుగా చేరితే నెలకు రూ.20వేలు- రూ.25వేల జీతం ఇస్తారని నమ్మిస్తున్నారు. ఓ రెండేళ్లు అక్కడే పనిచేస్తే బిడ్డలను ఉన్నత చదువులు చదివించొచ్ఛు. ఘనంగా పెళ్లిల్లు చేయవచ్చు అంటూ ఆశ చూపుతున్నారు. బాగుపడిన ఒకరిద్దరి ఉదంతాలు చెప్పుకుంటూ వందల మంది ఎర వేస్తున్నారు. ఇష్టం లేకపోయినా.. నెలలపాటు ఇళ్ల చుట్టూ తిరిగి మరీ ఒప్పించి.. ఎడారి బాట పట్టిస్తున్నారు. వీసీ, విమానా ఛార్జీలు, ఇతర ఖర్చులకంటూ రూ.లక్షన్నర వరకూ తీసుకుంటున్నారు. డబ్బు చెల్లించి వీసా పొందిన మహిళలు తీరా విమానమెక్కి, సేటు ఇంట్లో చిత్రహింసలు అనుభవిస్తున్నామని చెప్పే సరికి ఏజెంట్ల పత్తా ఉండటంలేదు. ఇక్కడ మహిళల బంధువులు గట్టిగా మాట్లాడితే మీరే మాకు బాకీ ఉన్నారంటూ బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొన్నేళ్లపాటు దర్యాప్తు చేసి బాధితులకు రిక్తహస్తం చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పర్యటక వీసా అంటకట్టి..